వైనాట్ 15 అంటున్న టీ కాంగ్రెస్
హైదరాబాద్, డిసెంబర్ 16,
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత దూకుడు మీదున్న కాంగ్రెస్ అదే జోష్‌తో పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పని చేస్తుంది. ఓ వైపు కీలక నేతలు ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉండగా గ్రౌండ్‌లో మాత్రం పార్టీ నేతలు , ఎమ్మెల్యేలు, పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్‌లు మాత్రం లోక్ సభ ఎన్నికల కోసం అప్పుడే వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పార్లమెంట్ ఎన్నికల్లోపు తన పాలన మార్కును చాటాలని భావిస్తున్నారు. తద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించడం పెద్ద కష్టమేమి కాదని పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలు ఉండగా దాదాపు 15 స్థానాలు కచ్చితంగా గెలుచుకోవాలని పక్క ప్లాన్ వేస్తున్నారు. ఒక్కో పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 13 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ చాలా స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించి విజయం సాధించింది. ప్రస్తుతం ఏయే పార్లమెంట్ పరిధిలో పార్టీ బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉందో అన్నదానిపై పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ లు లెక్కలు వేసే పనిలో పడ్డారు.దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1, నల్గొండ 1, మహబూబ్ నగర్ 2, వరంగల్ లో 2 తప్ప మిగిలిన అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోవడంతో వాటి పరిధిలో ఉన్న పార్లమెంట్ స్థానాలైన ఖమ్మం ,మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్, నల్గొండ, భువనగిరి లోక్ సభ స్థానాలు కచ్చితంగా గెలుస్తామని భావిస్తున్నారు. ఇక వీటితో పాటు పెద్దపల్లి, కరీంనగర్, జహీరాబాద్, చేవెళ్లలలో కూడా పెద్దగా ఇబ్బంది ఉండదని అక్కడ కొంచెం కష్టపడితే అవి కూడా విజయం సాధించవచ్చని భావిస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ గా రేవంత్ రెడ్డి విజయం సాధించారు. ఈసారి కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని నేతలు చెప్తున్నారు..కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క స్థానం కూడా గెలవకపోవడంతో హైదరాబాద్ , సికింద్రాబాద్‌లలో గెలవడం ఎలా అన్నదానిపై చర్చిస్తున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ 4 అసెంబ్లీ స్థానాలు గెలిచినప్పటికీ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మాత్రం ఖానాపూర్ ఒక్కటే విజయం సాధించింది, మిగిలినవి పెద్దపల్లి పార్లమెంట్‌లోకి వెళ్లడంతో ఈ లోక్ సభ స్థానం లో బీజేపీ ప్రభావం అధికంగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో 4 స్థానాలు గెలిచిన ఎల్లారెడ్డి జహిరాబాద్ పార్లమెంట్‌లో ఉండడంతో కొంత ఇబ్బందికరం అని భావిస్తున్నారు.మెదక్ పార్లమెంట్ పరిధిలో కేవలం మెదక్ అసెంబ్లీ మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది.. మిగిలినవి బీఆర్‌ఎస్ గెలుచుకుంది. దీంతో ఇక్కడ బీఆర్‌ఎస్ ప్రభావం అధికంగా ఉండనుంది. ఇప్పటికప్పుడు పార్లనెంట్ ఎన్నికలు జరిగిన 13 స్థానాలు కైవసం చేసుకుంటామని హస్తం నేతలూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ ఎన్నికల్లోపు 15 -16 లోక్ సభ స్థానాలు గెలుచుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. మరి కాంగ్రెస్ వ్యూహం ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి
వైనాట్ 15 అంటున్న టీ కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -