తగలబడందా… తగలబెట్టేరా

- Advertisement -

తగలబడందా… తగలబెట్టేరా
హైదరాబాద్, ఫిబ్రవరి 10, (వాయిస్ టుడే)

Will it burn… will it burn?
హైదరాబాద్‌లోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో  సంభవించిన భారీ అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రమాదంలో కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలు అగ్నికి ఆహుతయినట్లుగా తెలుస్తోంది.   సుమారు రెండు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఉదయం వేళ కార్యాలయం పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో, అకస్మాత్తుగా కంప్యూటర్ ల్యాబ్ విభాగం నుంచి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ఇతర విభాగాలకు వ్యాపించాయి. దట్టమైన పొగలు భవనం మొత్తాన్ని కమ్మేశాయి. ఈ ప్రమాద సమయంలో లోపల ఉన్న ఒక వ్యక్తికి గాయాలు కాగా, వెంటనే అప్రమత్తమైన సహచరులు బాధితుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.  ప్రమాద వార్త తెలియగానే డీసీపీ శిల్పవల్లి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పే ప్రక్రియను ఆమె స్వయంగా పర్యవేక్షించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ వంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట అగ్నిప్రమాదం జరగడంపై ఆమె అధికారులను ఆరా తీశారు. అసలు మంటలు ఎలా మొదలయ్యాయి? షార్ట్ సర్క్యూట్ కారణమా లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో ప్రాథమిక విచారణ చేపట్టారు.ఈ ప్రమాదంలో అత్యంత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. కంప్యూటర్ ల్యాబ్‌లో ఉన్న అనేక కీలకమైన కేసుల డేటా , భౌతిక పత్రాలు కాలి బూడిదయ్యాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పలు నేరాలకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలు, ఫోరెన్సిక్ విశ్లేషణలు ఈ ల్యాబ్‌లోనే ఉన్నాయి. సాక్ష్యాలు బుగ్గిపాలు కావడంతో ఆయా కేసుల విచారణపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సాధారణంగా ఫోరెన్సిక్ కార్యాలయాల్లో ఫైర్ సేఫ్టీ వ్యవస్థలు పకడ్బందీగా ఉంటాయి. అలాంటిది కంప్యూటర్ ల్యాబ్‌లోనే మంటలు రావడం, కీలక పత్రాలు ఉన్న చోటే ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా కావాలనే సాక్ష్యాలను రూపుమాపడానికి ఈ పని చేశారా? అనే కుట్ర కోణం పై పోలీసులు దృష్టి సారించారు. ల్యాబ్‌లోని సీసీటీవీ విజువల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.క్లూస్ టీమ్ , ఎలక్ట్రికల్ ఇన్‌స్పెక్టరేట్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. కంప్యూటర్లలోని హార్డ్ డిస్క్‌లు ఎంతవరకు దెబ్బతిన్నాయి, వాటి నుంచి డేటాను రికవరీ చేసే అవకాశం ఉందా అనే దానిపై ఐటీ నిపుణుల సలహాలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ నివేదికలు తారుమారైతే నేరస్తులకు మేలు జరుగుతుందనే కోణంలో పోలీసులు అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular