ఎన్డీయేలోకి టీడీపీ
న్యూఢిల్లీ, ఆగస్టు 31: ఏపీ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. అయినా.. అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పావులు కదువుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే పొత్తుల ప్రతిపాదన చేశారు. టీడీపీని కలుపుకుపోవాలని నిర్ణయించారు. ఈమేరక బీజేపీ అధిష్టానానికి కూడా చూసించారు. కానీ, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో టీడీపీ చేసిన ఆరోపణలు, అమిత్‌షాపై తిరుపతిలో దాడి చేయించడం వంటి పరిణామాలు, టీడీపీ కుటుంబ పార్టీగా ఉండడం తదితర కారణాలతో బీజేపీ ఆ పార్టీని దూరం పెడుతుంది. ఏపీలో ఇప్పటికే బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తున్నాయి. జనసేనాని ఇప్పటికే ఏపీలో దూకుడు పెంచారు. వారాహి యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే మూడు విడతల పర్యటన పూర్తయింది. ఈ క్రమంలో టీడీపీని కలుపుకుపోయే ప్రతిపాదనపై జనసేనాటి బీజేపీపై ఒత్తిడి చేస్తున్నారు. వైసీపీ ముక్త ఏపీ కోసం అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండాలంటే.. కూటమిగా పోటీ చేయడమే మేలన్న భావనలో జనసేనాని ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానంపైనా ఒత్తిడి తెస్తున్నారు. దీంతో బీజేపీ కూడా కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది.
ఇన్నాళ్లూ చంద్రబాబుతో మాట్లాడడానికి కూడా సుముఖంగా లేని బీజేపీ నేతలు ఇటీవల అపాయింట్ మెంట్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనం.. బీజేపీ, జనసేన, టీడీపీ అలయన్స్ కుదిరినా.. టీడీపీ ఏన్‌డీఏలో చేరికకు మార్గం సుగమమైనా.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏన్డీఏ కూటమిగా పోటీ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో కూటమిలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. ఈమేరకు చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం.పొత్తు కుదిరితే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేనకు కలిపి 30 స్థానాలు ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. ఇక లోక్‌సభ ఎన్నికల విషయానికి వస్తే.. బీజేపీ, జనసేనకు కలిసి 5 ఎంపీ సీట్లు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. పొత్తు కుదిరిన తర్వాతనే సీట్ల కేటాయింపు అంశంపై చర్చలు జరిగే అవకాశం ఉంది.జనసేనాని పవన్ కళ్యాణ్ ఒత్తిడి ఒకవైపు.. తిరిగి ఎన్డీఏలో చేరాలన్న టీడీపీ ఉత్సాహం నేపథ్యంలో బీజేపీ తీసుకునే నిర్ణయమే కీలకంగా మారనుంది. ప్రస్తుతం బీజేపీ, వైసీపీ మధ్య పొత్తు లేకపోయినా.. బీజేపీకి వైసీపీ అంశాల వారీగా మద్దతు ఇస్తోంది. బీజేపీ కూడా కఠినంగా వ్యవహరించడం లేదు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన ప్రయత్నాలు ఏమేరకు సఫలం అవుతాయన్న చర్చ కూడా జరుగుతోంది. కుదిరితే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసే ప్రతిపాదన కూడా జగన్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఇటు జనసేన, అటు టీడీపీ ఆశలు గల్లంతు కావడం ఖాయం.