శ్రీలంక పాకిస్తాన్ మ్యాచ్
హైదరాబాద్:అక్టోబర్ 10: వరల్డ్‌కప్‌లో భాగంగా మంగళవారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే పోరులో శ్రీలంకతో పాకిస్థాన్ తలపడనుంది. లంక ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. మరోవైపు నెదర్లాండ్స్‌తో ఉప్పల్‌లోనే జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘన విజయం సాదించింది. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కూడా సోమవారం ముమ్మర సాధన చేశాయి. తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన లంక ఈసారి మాత్రం విజయమే లక్షంగా పెట్టుకుంది. మొదటి మ్యాచ్‌లో బౌలర్లు ఘోరంగా విఫలం కావడంతో లంకను కలవరానికి గురిచేస్తోంది.
ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించాలనే పట్టుదలతో ఉంది. సౌతాఫ్రికా మ్యాచ్‌లో రజిత, మధుశంకా, పతిరణ, వెల్లలాగే తదితరులు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే బ్యాటింగ్‌లో మాత్రం లంక కాస్త పర్వాలేదనిపించింది. కుశాల్ మెండిస్ 42 బంతుల్లోనే 76 పరుగులు చేయడం జట్టుకు కలిసి వచ్చే అంశమే.
అసలంక, కెప్టెన్ శనక కూడా బ్యాట్‌ను ఝులిపించారు. ఈ మ్యాచ్‌లో కూడా బ్యాటర్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు పాకిస్థాన్ కూడా ఈ పోరుకు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. నెదర్లాండ్స్ మ్యాచ్‌లో బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. ఓపెనర్లు ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, కెప్టెన్ బాబర్ ఆజమ్‌లు విఫలమయ్యారు. కానీ వికెట్ కీపర్ రిజ్వాన్, సౌద్ షకిల్, నవాజ్, షాదాబ్‌లు ధాటిగా ఆడడం పాక్‌కు ఊరటనిచ్చే అంశమే. బౌలింగ్‌లో పాక్ చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో పాక్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది…