- Advertisement -
గండికోటలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
World Tourism Day celebrations in Gandi Kota
కడప
అంతర్జాతీయ టూరిజం మ్యాప్ లో గండికోట పర్యాటక కేంద్రానికి ప్రత్యేక స్థానాన్ని తీసుకువస్తామని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కడప జిల్లా గండికోట పర్యాటక కేంద్రంలో.. గండికోట అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేసిన పలు నిర్మాణాలకు.. జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తోపాటు జమ్మలమడుగు ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి, జేసీ అదితి సింగ్, డిఎఫ్ఓ సందీప్ రెడ్డిలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి మాట్లాడుతూ గండికోటకు ఒక చరిత్ర ఉందని ఈ ప్రాంతాన్ని రాష్ట్ర లోనే కాదు దేశంలో ప్రసిద్ధిగాంచిన ప్రదేశంగా గుర్తుండిపోయే టట్లు అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. పర్యాటక దినోత్సవం సందర్బంగా గండికోట ఉత్సవాలు అందరి సహకారంతో అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వాంగా ఉందన్నారు. ప్రస్తుతం నిర్వహణలో ఉన్న రోప్ వే ద్వారా గండికోట గార్జ్, పెన్నానది అందాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయన్నారు. గండికోటలో ఒబెరాయ్ సంస్థ వారు 5 స్టార్ రిసార్ట్ ను కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజులలో గండికోటను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక హబ్ గా అభివృద్ధి చేస్తామన్నారు. ఇక్కడి హార్స్ రైడింగ్ రూట్, అడ్వెంచర్ అకాడమీ అబ్బురపరిచే విన్యాసాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. గ్రాండ్ కానియన్ తో సమానంగా గండికోటను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. రాబోయే రోజులలో ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారబోతున్నాయన్నారు. పర్యాటకం అంటే.. ఆదాయంతో పాటు ఆదయాన్నిచ్చే వనరుగా ఉండాలన్న ఉద్దేశ్యంతో గండికోట పర్యాటక ప్రాంతాన్ని దశల వారీగా అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. గండికోట అభివృద్ధిలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయరెడ్డి సహకారం అభినందనీయం అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో అనేక చారిత్రక, పర్యటక, దర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయని.. ఈ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ముందుకు వెళుతున్నామన్నారు.
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ కులమతాలకు వర్గాలకు అతీతంగా పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా గండికోట ఉత్సవాలను జిల్లా యంత్రాంగం నిర్వహిస్తుందన్నారు. జిల్లా యంత్రాంగం గండికోట ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం ప్రతి ఒక్కరు సంతోషించదగ్గ విషయమన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజల క్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతుందన్నారు. గండికోట పర్యాటక అభివృద్ధితో జమ్మలమడుగు నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గండికోట లో గ్రాండ్ కానియన్ లో మంచి అద్భుతమైన లోయలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతాన్ని గ్రాండ్ కాన్యన్ కంటే అందమైన ప్రాంతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరుగుతోందన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో అన్ని రకాల వనరులు పుష్కలంగా ఉన్నాయని, త్వరలో మరో థర్మల్ పవర్ కేంద్రం కూడా స్థాపితం కానుందన్నారు. అక్టోబర్ 7వ తేదీన నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. గండికోటకు స్వదేశీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా కేంద్రం నుండి నిధులు కూడా విడుదల చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో గండికోట ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తామన్నారు. రాబోయే రోజులలో జమ్మలమడుగు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ వన్ గా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.
- Advertisement -