ఏపీ అంతటా వైసీపీ నిరసనలు
YCP protests across AP
విజయవాడ డిసెంబర్ 27
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత వరుసగా విద్యుత్ చార్జీలు పెంచుతున్నారని ఆరోపిస్తూ వైఎస్ఆర్‌సీపీ నిరసనలు నిర్వహించింది. ఎన్నికలకు ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్నారు. విద్యుత్ చార్జీలు పెంచమని హామీ ఇచ్చారని నేతలు గుర్తు చేశారు. ఇప్పటికే 15,500 కోట్ల పెను భారాన్ని పేదలపై మోపారని విమర్శించారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నారు. మీ భవిష్యత్తుకు మాది గ్యారంటీ అన్నారు.. ఒక్క హామీ కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేదని ధర్నాల్లో పాల్గొన్న నేతలు విమర్శలు గుప్పించారు. ఒకేసారి విద్యుత్ ఛార్జీలు పెంచితే ప్రజలు తిరుగుబాటు చేస్తారని విడతల వారీగా పెంచుతున్నారని.. వెయ్యి రూపాయలు వచ్చే విద్యుత్ బిల్లు 1400 నుంచి 1500 వరకు వస్తుందన్నారు. ప్రజల మీద వేసే భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ కాలనీలో అంధకారంలోకి వెళ్లిపోయాయి.. 75 వేల కోట్ల అప్పు చేసిన డబ్బు ఏమైందని విశాఖలో ధర్నా చేసిన గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. ఒక్క రూపాయి అయినా పేదవాడికి పంచారా..బాబు షూరిటీ.. బాదుడు గ్యారెంటీ అనే తరహాలో చంద్రబాబు పాలన ఉందన్నారు. చంద్రబాబు అధికారంలో పెరిగినంతగా విద్యుత్ ఛార్జీలు ఏ ప్రభుత్వంలో పెరగలేదని వైసీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వంలో బషీర్ బాగ్ లో విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న వారిపై కాల్పులు జరిపారని గుంటూరులో ధర్నా చేసిన అంబటి రాంబాబు విమర్శించారు. బు మాకు11 మంది ఎమ్మెల్యేలు అని అనుకోకండి, మా వైపు నలభై శాతం ఓట్లున్నాయని హెచ్చరించారు. నేను ఎన్నో ప్రభుత్వాలు చూశాను కానీ ఇప్పుడు పెరిగినంత విద్యుత్ చార్జీలు ఏ ప్రభుత్వంలో పెరగలేదు కూటమి నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు.
మెడలువంచి ఇచ్చిన హామీలను అమలు
చంద్రబాబు మెడలో వంచి ఇచ్చిన హామీలను అమలు చేయిస్తామని పలు చోట్ల ధర్నాలో పాల్గొన్న వైసీపీ నేతలు ప్రకటించారు. రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. రైతులు ధాన్యం కొనకుండా మోసం చేశారు. రైతులకు ఇంత పెద్ద ద్రోహం చేసింది ఒకే ఒక్కడు చంద్రబాబు అని నేతలు మండిపడ్డారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని పలు చోట్ల విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మాజీ సీఎం జగన్ పిలుపు మేరకు వైసీపీ శ్రేణులు విద్యుత్ ఛార్జీలపై శుక్రవారం నిరసనలు కొనసాగిస్తున్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, వైసీపీ నిరసనల పర్వానికి శ్రీకారం చుట్టింది. ముందుగా అన్ని జిల్లాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి, అక్కడక్కడా వైసీపీ శ్రేణులు రహదారిపై బైఠాయించారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా బందోబస్తు చేపట్టారు. ఇలా శుక్రవారం నిరసనల పర్వం సాగుతోంది.అయితే వైసీపీ నిరసనలు ఏమో కానీ, టీడీపీ సోషల్ మీడియా మాత్రం ఘాటు రిప్లై ఇస్తోంది. ఓ వైపు వైసీపీ సోషల్ మీడియా పెరిగిన విద్యుత్ చార్జీల పాపం కూటమిదేనంటూ ఓ వైపు నిరసన సాగిస్తూ, మరోవైపు సోషల్ మీడియాలో కూడా విస్తృత ప్రచారం చేస్తోంది. దీనికి స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడంలో బిజీగా ఉంది టీడీపీ. 6 నెలల్లో విద్యుత్ ఛార్జీలను పెంచి కూటమి, ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపుతుందని వైసీపీ అంటుండగా, మరోవైపు ఈ పాపం మీదేనంటూ టీడీపీ కోడై కూస్తోంది. ఐదేళ్లలో మాజీ సీఎం జగన్ మింగిన వేలకోట్ల లంచాల ధాటికి, అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లు చేయాల్సి వచ్చిందని, అదే ఇప్పుడు వినియోగదారులపై పెనుభారంగా మారిందని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది.నక్కల కుతంత్రాల గురించి చందమామ కథల్లో చదివాం కానీ… కొంతమంది మనుషులు కూడా అలాంటి నక్కలకు ఏమాత్రం తీసిపోరని ఈరోజు ఏపీ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారంటూ టీడీపీ సీరియస్ కామెంట్స్ చేసింది. 9 సార్లు కరెంటు చార్జీలు పెంచి ప్రజల నుంచి ఐదేళ్ళలో రూ.32000 కోట్లు ముక్కు పిండి వసూలు చేసి.. 10వ సారి పెంచడానికి కూడా తానే అనుమతి తెచ్చుకున్న మాజీ సీఎం జగన్… ఇప్పుడు తానే ధర్నాలు చేయడం ఏంటోనంటూ టీడీపీ సోషల్ మీడియా ప్రశ్నిస్తోంది.