2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు
2025: Delhi Assembly Election Dates Finalised
ఆ పార్టీల మధ్యనే పోటీ
న్యూఢిల్లీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు దాదాపు పూర్తి చేసింది ఉన్నతాధికారులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించిన ఈసీ అధికారులు, జనవరి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నారు. 2025 ఫిబ్రవరి 15తో ప్రస్తుత అసెంబ్లీ ఢిల్లీ 7వ అసెంబ్లీ, గడువు ముగుస్తోంది. ఈలోగా ఎన్నికలు ప్రక్రియను పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘంపై ఉంది.
గత అసెంబ్లీ ఎన్నికల 2020, సమయంలో జనవరి 14న నోటిఫికేషన్ జారీ అవ్వగా, ఫిబ్రవరి 8న పోలింగ్ జరిగింది. ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. ఈసారి కూడా కాస్త అటూ ఇటుగా తేదీలు ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల నిర్వహణలో విద్యాశాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కాబట్టి ఈ ఏడాది జరగబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిబి ఎస్ సి, పరీక్షల తేదీలతో ఎన్నికల తేదీలకు ఇబ్బంది కలుగకుండా కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
దళిత, మైనారిటీ వర్గాల్లో కోల్పోయిన పట్టును మళ్లీ సాధిస్తూ తమ ఓటు బ్యాంకును మెరుగు పరుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, ఈ సారి ఎలాగైనా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది. ఇప్పటికే పొరుగునే ఉన్న హర్యానాలో గెలుపు వాకిట తడబడి ఓడిన కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఆప్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన 53.57 శాతం ఓట్లు సాధించి 70 అసెంబ్లీ స్థానాల్లో 62 గెలుపొందగా, 38.51 శాతం ఓట్లు సాధించిన బీజేపీ 8 సీట్లలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 4.26 శాతానికే పరిమితమైంది.
పదేళ్ల పాలనపై సహజంగా ఏర్పడే వ్యతిరేకతకు తోడు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, శీష్ మహల్‌గా పేరొందిన విలాస నివాస భవనం సహా 2020 ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలను అమలు చేయలేకపోవడం వంటివి కేజ్రీవాల్‌కు ప్రతికూలాంశాలుగా మారాయి. ఈ ప్రతికూలతలు కేజ్రీవాల్ గతంలో సాధించిన 53 శాతం ఓట్లలో కోత విధిస్తాయని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే అవి ఎటువైపు మళ్లుతాయి అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ఒకవేళ నేరుగా బీజేపీకి బదిలీ అయితే ఆ పార్టీ విశేషంగా లాభపడుతుంది. అలాకాకుండా కాంగ్రెస్ వైపు మళ్లినా సరే.. పరోక్షంగా బీజేపీకే వరంగా మారుతుంది. తాజా లోక్‌సభ ఎన్నికల తర్వాత ముస్లిం మైనారిటీలు, దళిత ఓట్లలో మళ్లీ కొంతమేర పట్టు సాధించిన కాంగ్రెస్ పార్టీ, ఈ వర్గాలను కేజ్రీవాల్‌కు దూరం చేసినా సరే. కమలదళానికే ఉపయోగం ఎక్కువ. కాంగ్రెస్ పెంచుకునే ఓట్లశాతం ఆ పార్టీని గెలిపించకపోయినా.. దశాబ్దకాలం తర్వాత ఖాతా తెరిచేందుకు ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీని బలహీనపరిచి, బీజేపీకి పరోక్ష ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది.
మరోవైపు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పురుడు పోసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇతర రాజకీయ పార్టీలకు భిన్నమేమీ కాదని, అనేక రకాల అవినీతి, అక్రమాలకు తెరలేపిందని కమలదళం ప్రజాకోర్టులో బురదజల్లింది. ఇది తనపై సాగుతున్న కక్షసాధింపు రాజకీయమని, ప్రజాకోర్టులోనే తీర్పు అడుగుతానని సీఎం పదవిని వదులుకుని ఎన్నికల ప్రచారం చేపట్టిన కేజ్రీవాల్, కేసులు, అరెస్టు, జైలుపాలవడాన్ని సానుభూతి పవనాలుగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో సాధించిన ఓట్లశాతాన్ని సమీప ప్రత్యర్థి బీజేపీతో పోల్చుకుంటే 15 శాతం తేడా ఉంది. ఇందులో ప్రతికూలతల కారణంగా కొంత మేర ఓట్లు తగ్గినా. ఈ భారీ వ్యత్యాసాన్ని పూడ్చలేవని, సీట్లు కొన్ని తగ్గినా విజయం తమదేనన్న ధీమాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది.