ఆర్టీసీ లో 3 వేల ఉద్యోగాల భర్తీ
హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో గతంలో రోజుకు 45 లక్షల మంది ప్రయాణిస్తే మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తరువాత ఆ సంఖ్య సగటున 55 లక్షలకు పెరిగిందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని 2 వేల కొత్త డీజిల్ బస్సులు, 990 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయన్నారు. అందుకనుగుణంగా 3 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు బస్‌భవన్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో 56,604 మంది ఆర్టీసీ ఉద్యోగులు 29 రోజులపాటు సకలజనుల సమ్మె చేసి కీలకపాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు రవీందర్, విజయపుష్ప, రాజశేఖర్, శ్రీధర్, ఉషాదేవి, విజయభాస్కర్ పాల్గొన్నారు.