ఏపీలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు
34% reservation for BCs in local bodies in AP
విజయవాడ, ఆగస్టు 18 (వాయిస్ టుడే): ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.1 శాతం బీసీ రిజర్వేషన్లకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను త్వరితగతిన నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి నిధులు నిలిచిపోకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మేయర్ ఎన్నికల్లో కీలక మార్పు
మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్‌ను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కౌన్సిలర్ల కొనుగోళ్లు, హార్స్ ట్రేడింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
డిప్యూటీ మేయర్ విషయంలో గత విధానాన్నే కొనసాగిస్తూ ఒకే డిప్యూటీ మేయర్ ఉండేలా నిర్ణయం తీసుకుంది.
స్థానిక సంస్థల సంస్కరణలతో పాటు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనకు సంబంధించిన మొత్తం 57 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.




