బెంగళూరు, ఆగస్టు 26 : బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. చంద్రయాన్-3ని విజయవంతంగా ల్యాండింగ్ చేసిన శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో చీఫ్ సోమనాథ్‌తో సహా ఇతర శాస్త్రవేత్తలందరినీ కలుసుకున్నారు ప్రధాని! ఈ అసాధారణ విజయానికి కారకులైన శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు భావోద్వేగంతో ప్రసంగించారు. చంద్రయాన్ త్రీ ల్యాండింగ్ ప్రదేశానికి ‘శివశక్తి’ అని నామకరణం చేశారు. ఏ వైఫల్యమూ అంతిమం కాదన్నారు ప్రధాని మోదీ! ఆగస్ట్ 23వ తేదీని ఇక నుంచి ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా ప్రకటించారు ప్రధాని! మూన్ మిషన్‌లో మహిళా శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు మోదీ! మొత్తం సృష్టికి మహిళా శక్తే ఆధారమని కీర్తించారు. ప్రాచీన ఋషుల కాలాన్ని ప్రస్తావిస్తూ.. అంతరిక్ష రహస్యాలను మన రుషులు ఏనాడో వివరించారని గుర్తుచేశారు మోదీ! ఇప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశ వైజ్ఞానిక శక్తిని.. మన సాంకేతికతను, మన శాస్త్రీయ స్వభావాన్ని అంగీకరిస్తున్నాయన్నారు ప్రధాని! చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 దిగిన క్షణం.. ఇప్పుడు అమరత్వం చెందిందని అన్నారు. ఇస్రో అంతరిక్ష కేంద్రానికి చేరుకునే ముందు, బెంగళూరు ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు, అక్కడ జై విజ్ఞాన్, జై అనుసంధాన్ అని నినదించారు.
మహిళ శాస్త్రవేత్తలకు అభినందన
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 విజయంలో ఎంతో మంది మహిళా శాస్త్రవేత్తల పాత్ర ఉంది. శనివారం ఉదయం ప్రధాని మోదీ ఆ శాస్త్రవేత్తలను కలిసిన విషయం తెలిసిందే. బెంగుళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ కార్యాలయంలో వారిని ఆయన కలిశారు. ఈ క్రమంలో చంద్రయాన్-3 ప్రాజెక్టులో మహిళల పాత్ర అనిర్వచనీయమని ప్రధాని మోదీ వారిని అభినందించి, మెచ్చుకున్నారు. అలాగే వారితో కలిసి గ్రూపు ఫోటో కూడా దిగారు. విక్రమ్ ల్యాండైన ప్రాంతాన్ని శివశక్తిగా ప్రధాని మోదీ నామకరణం చేశారు. అలాగే ఆగస్ట్ 23వ తేదీని ఇక నుంచి జాతీయ అంతరిక్ష దినోత్సవంగా కూడా ప్రకటించారు. ఈ నేఫథ్యంలో మహిశా శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని తమను మెచ్చుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా మార్స్, ఆదిత్య మిషన్లు చేపట్టనున్నట్లు వారు చెబుతున్నారు.
విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రాంతానికి శివశక్తి, అలాగే చంద్రయాన్-2 క్రాష్ అయిన ప్రాంతానికి తిరంగా పేర్లను పెట్టడం సంతోషంగా ఉందని ఇంజినీర్ పద్మావతి అన్నారు. ప్రధాని మోదీ తమ కార్యాలయానికి వచ్చి అభినందించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తమలో ఎంతో స్పూర్తిని నింపారని.. తామంతా గర్వంగా ఫీలవుతున్నామని ఇస్రో మహిళా ఇంజినీర్ సరితారెడ్డి అన్నారు.ప్రధాని మోదీతో కలిసి మాట్లాడడం చాలా సంతోషించదగ్గ విషయమని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ శాస్త్రవేత్త అన్నారు. నారీ శక్తిని గుర్తించడం, ప్రోత్సహించడం సంతోషంగా ఉందని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ శాస్త్రవేత్త ప్రియాంకా మిశ్రా పేర్కొన్నారు.గగన్‌యాన్ ప్రాజెక్టుకు చంద్రయాన్ సక్సెస్ పెద్ద ప్రేరణగా నిలుస్తుందని ఇంజినీర్ ఆర్తీ సేన్ వివరించారు. మార్క్ 3 రాకెట్‌ను మరింత శక్తివంతంగా మార్చాల్సిన సమయం దగ్గరికొచ్చిందని తెలిపారు. గగన్‌యాన్‌కు కూడా ప్రతి ఒక్కరి మద్ధతు కావాలని కోరారు.మన కండ్ల ముందు ఓ అద్భుతాన్ని చూశామని ఇంజినీర్ నిధి పోర్వాల్ అన్నారు. ఇది చరిత్రాత్మక సందర్భమని ప్రాజెక్టు మేనేజర్ సౌజన్య పేర్కొన్నారు. మిషన్ సక్సెస్ కావడం తమకు ఎంతగానో సంతోషాన్నిచ్చిందని జూనియర్ ఇంజినీర్ నిత్యా భారతి తెలిపారు.
ప్రధాని ప్రసంగం ప్రేరణాత్మకంగా ఉందని ముత్తు సెల్వి అన్నారు. శివశక్తి పేరు పెట్టడం నారీ శక్తిని ప్రోత్సహించడమే అని ఇస్రో శాస్త్రవేత్త సావిత్రి తెలిపారు.