రాజకీయ అనుభవం లేని కంది ఒక బజారు రౌడీలా ప్రవర్తిస్తున్నాడు
ఓట్ల కోసం కేవలం వ్యక్తిగత దూషణలకు దిగుతూ నీచమైన కుట్ర పన్నుతున్నారు
కాంగ్రెస్ అభ్యర్థికి మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత వార్నింగ్
ఆదిలాబాద్ నవంబర్ 14: జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరుకుంటున్నది. ఆ పార్టీ నేతలు ఒకరిపై వ్యక్తిగత దూషణలు, ఆరోపణలు చేసుకుంటూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు. తాజాగా అదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీలో దుమారం చెలరేగుతున్నది. అమెరికా నుండి వచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డిఅనే మూర్ఖుడు తమపై లేనిపోని అసత్య ఆరోపణలు మానుకోవాలని మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాతమాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ రెబెల్ అభ్యర్థి అల్లూరి సంజీవ్ రెడ్డి హెచ్చరించారు.ఇటీవల కంది శ్రీనివాస్ రెడ్డి ప్రచారంలో భాగంగా చేసిన వ్యక్తిగత ఆరోపణలు, అనుచిత పదజాలంతో దూషించడంపై వారు మీడియాతో మాట్లాడారు. అనంతరం కంది తీరుపై ఎలక్షన్ కమీషన్‌కు, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని కంది ఒక బజారు రౌడీలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేవలం వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఓట్లు రాబ ట్టుకోవాలని నీచమైన కుట్ర పన్నుతున్నాడని, ప్రజలకు తామెలాంటి వారిమో తెలుసన్నారు. కోట్లు పెట్టి కొనుక్కున్న టికెట్‌తో మదమెక్కి మాట్లాడుతున్న కంది శ్రీనివాస్‌రెడ్డికి దమ్ముంటే ఆ ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. ఒక మహిళ అని చూడకుండా శూర్పణఖ అంటూ, బూతులతో అసభ్య పదజాలంతో దూషించడం సిగ్గుచేటని అన్నారు.గండ్రత్ సుజాత గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన మహిళగా ప్రజల్లో ఎంతో అభిమానాన్ని పొందిన ఆమెను ఎన్నికల్లో అమ్ముడుపోయారని అసత్య ఆరోపణలు చేయడం కంది దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కోరినామని ఇలాంటి వారికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.