ఓటర్లకు కన్ ఫ్యూజన్
హైదరాబాద్, నవంబర్ 18, (వాయిస్ టుడే): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ అభ్యర్థుల పేర్లు ఒకటే కావడంతో ఓటర్లు తికమక పడుతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లున్న పలువురు అభ్యర్థులు ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల బరిలోకి దిగారు. దీంతో అసలు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు? స్వతంత్ర అభ్యర్థి ఎవరు అనేది ఓటర్లకు కన్ ఫ్యూజన్ గా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లను చీల్చి వారి విజయాన్ని ప్రభావితం చేసేలా కొందరు అభ్యర్థుల పేరున్న వారితో నామినేషన్లు వేయించారని సమాచారం.ఇంటి పేరు వేరైనా అసలు పేరు ఒకటే కావడంతో తమకు తలనొప్పిగా మారిందని అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా , రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ పోటీ చేస్తుండగా, ఎ. అజయ్, కె. అజయ్ పేరున్న అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచారు. కొడంగల్ నియోజకవర్గంలో పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా ప్యాట నరేందర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నారు.నారాయణపేటలో ఎస్ రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉండగా, కె. రాజేందర్ రెడ్డి ఇండిపెండెంటుగా నిలిచారు. మిర్యాలగూడ సెగ్మెంటులో బి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా, బి లక్ష్మారెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోనూ ఎస్ సైదిరెడ్డి (బీఆర్ఎస్), టి సైదిరెడ్డి (ఏడీఆర్)లు ఎన్నికల బరిలో ఉన్నారు. మునుగోడులోనూ కె ప్రభాకర్ రెడ్డి పేరున్న వారు బీఆర్ఎస్, ఏడీఆర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
ఈ నియోజకవర్గంలో ఇంటి పేరు కూడా కలిసింది.మహేశ్వరంలో కె లక్ష్మారెడ్డి (కాంగ్రెస్), కె లక్ష్మారెడ్డి (జనశంఖారావం), పి సబిత (బీఆర్ఎస్), ఎం సబిత (స్వతంత్ర) అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీంతో ఓటర్లు అసలు పార్టీ అభ్యర్థులు ఎవరనేది వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎల్బీనగర్ లో బీఆర్ఎస్ పక్షాన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, డి సుధీర్ రెడ్డిలు నిలిచి ఓటర్లను సందిగ్ధంలో ముంచెత్తారు. మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మంత్రి వి శ్రీనివాసగౌడ్ పై స్వతంత్ర అభ్యర్థి ఎం శ్రీనివాసులు గౌడ్ ఉన్నారు.దేవరకద్రలో ఏ వెంకటేశ్వరరెడ్డి ఉండగా, అదే పేరున్నఅభ్యర్థి స్వతంత్రంగా బరిలోకి దిగారు. దీంతో అసలు అభ్యర్థి ఎవరనేది ఓటర్లకు పజిల్ గా మారింది. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డి, ఏడీఆర్ పార్టీ అభ్యర్థిగా మన్నె లక్ష్మారెడ్డి రంగంలో పోటీ పడుతున్నారు. ఇబ్రహీంపట్నంలోనూ మంచిరెడ్డి కిషన్ రెడ్డి(బీఆర్ఎస్), కె కిషన్ రెడ్డి(ఏడీఆర్) పోటీలో ఉన్నారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై అదే పురున్న అభ్యర్థి ఏడీఆర్ పార్టీ పక్షాన నిలిచారు.ఒకే పేరున్న స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు స్క్రూట్నీలో కొన్ని తిరస్కరించగా మరికొందరు బరిలో కొనసాగుతున్నారు. దీంతో అసలు అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఇంకా పలు నియోజకవర్గాల్లో ఒకే పేరున్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మొత్తంమీద ఈ సారి ఒకే పేరున్న అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగడం విశేషంగా మారింది.