మారిన కమల వ్యూహం…
హైదరాబాద్, నవంబర్ 20, (వాయిస్ టుడే): రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. ప్రధాన పార్టీల జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ చావో రేవో అన్నట్లుగా బరిలో ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం కాస్త నింపాదిగానే ఉంది. దీనికి కారణం బీజేపీ వ్యూహాలు వేరేగా ఉండటమే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి స్థాయిలో హోరాహోరీగా సాగుతున్నాయి. ఇందులో సందేహం లేదు. ఎక్కువ మంది హంగ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒక వేళ హంగ్ అంటూ వస్తే.. కింగ్ అయ్యేది బీజేపీనేనని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. దీనికి కారణం… రాజకీయ పరిస్థితులు మాత్రమే కాదు.. బీజేపీ వ్యూహాలు కూడా అనుకోవచ్చు. బీజేపీ హైకమాండడ్ కు ఓ స్పష్టమైన విజన్ ఉంటుంది. ఏదైనా రాష్ట్రంలో పోటీ చేస్తున్నప్పుడు బలాబలాల్ని అంచనా వేసుకుని తాము గెలవగలిగే సీట్లపై పూర్తి స్థాయిలో దృష్టిపెడతారు. బలహీనంగా ఉన్న చోట్ల సమయం వెచ్చించరు. తెలంగాణ విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారు. గెలుపు అంటే అసెబంబ్లీలో మెజార్టీ సాధించడం మాత్రమే కాదు.. అలా సాధించడం క్లిష్టంగా మారినప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వ్యూహాన్ని అమలు చేయాలి. అదే అమలు చేస్తున్నారు.
ప్రభుత్వ ఏర్పాటు అనేది తమ చేతుల్లో ఉండే అన్ని సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. అందు కోసం బీజేపీకి క్లియర్ చాన్సులు ఉన్న 23 స్థానాలపై దృష్టి పెట్టారరని చెబుతున్నారు. తెలంగాణ బీజేపీ ఇరవై మూడు అసెంబ్లీ సీట్లను సీరియస్ గా తీసుకుంది. అక్కడ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా హంగ్ తీసుకు రావాలని .. తాము కింగ్ మేకర్లం లేదా కింగ్ కావాలని గట్టి పట్టుదలగా ఉంది. అందుకే గతంలో బలంగా ఉన్న, రెండో స్థానంలో నిలిచిన నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సాధించిన సీట్లపైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. ఈ జాబితాలో మొత్తం 23 సీట్లు ఉన్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముథోల్ వంటి చోట్ల రెండో స్థానంలో నిలిచింది. పార్లమెంట్ ఎన్నికల నాటికి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో దాదాపుగా పన్నెండు స్థానాల్లో బీఆర్ఎస్ కంటే ఎక్కువ మెజార్టీ సాధించింది. ఈ స్థానాలన్నింటిలోనూ బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. అలాగే గ్రేటర్ పరిధిలో కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది. అక్కడ పలు నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితి అంచనా వేసుకుని కొన్ని నియోజకవర్గాలపై గురి పెట్టింది. సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వరరావు బలమైన నేతగా ఉన్నారు. అలాగే మహబూబ్ నగర్ జిల్ల లో కల్వకుర్తి , గద్వాల వంటి చోట్ల విజయానికి తగ్గరగా వచ్చి ఆగిపోతుంది. ఇలాంటి నియోజకవర్గాలన్నీ ఎంపిక చేసుకుని బలమైన అభ్యర్థులు ఉన్నారనుకున్న చోట్ల గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇరవై మూడు సీట్లలో విజయం సాధిస్తే సీన్ మొత్తం మారిపోతుంది. బీజేపీకి పదిహేను వరకూ సీట్లు సాధిస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ విజయానికి దూరం అవుతాయి. ఏదైనా పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి రావొచ్చు. గతంలో కర్ణాటక తరహా పరిణామాలు ఏర్పడే చాన్స్ ఉంది.ఒకవేళ త్రిముఖ పోరులో కొన్ని చోట్ల గెలుపొందినా ఆశ్చర్యపోనక్కరలేంటున్నారు. అలాగే అందరూ ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లే వస్తాయనే వాదనలూ ఉన్నాయి. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో పరివార్‌కు సంబంధించిన ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, ఏబీవీపీ, యువమోర్చా నేతలు ఇప్పటికే ఇంటింటి ప్రచారం చేస్తున్నారని సమాచారం. వీళ్ల ఓటు బ్యాంక్ పెరిగితే అంతిమంగా అది ఎవరి నష్టం చేస్తుందో ఇప్పుడే చెప్పలేమని రాజకీయవర్గాల అంచనా. మేనిఫెస్టోను కూాడ బీజేపీ సాదాసీదాగా రిలీజ్ చేసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో పోటీగా ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఉచిత కాశీ యాత్ర, కొన్ని రకాలచదువులు చదివే అమ్మాయిలకు ల్యాప్ ట్యాప్ వంటి హామీలు ఇచ్చింది. ఇవేమీ మిగతా రెండు పార్టీలతో పోలిస్తే పెద్దగా ప్రజాకర్షమైనవి కావు. బీజేపీ వ్యూహాం వేరుగా ఉంది కాబట్టి మేనిఫెస్టోను సాదాసీదాగా రిలీజ్ చేసిందని.. అంటున్నారు. బీజేపీ పోటీ పడుతున్న చోట్ల.. ఇంకా బీజేపీ ఏం ఇస్తుందో అని చూసి ఓటేయరు.అక్కడున్న పరిస్థితులను బట్టి ఓటేస్తారు. అందుకే బీజేపీ హంగ్ ప్లాన్‌తోనే రాజకీయ అడుగులు వేస్తోంది.