హైదరాబాద్, డిసెంబర్ 1, (వాయిస్ టుడే): తెలంగాణ దంగల్ ముగిసింది.. 70 శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ తరుణంలో టీజేఎస్ చీఫ్.. ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు అసంతృప్తి ఉందంటూ కోదండరామ్ పేర్కొన్నారు. గెలిచిన నేతలు పార్టీలు మారకుండా చూడాలంటూ అభిప్రాయపడ్డారు. పార్టీలు మారితే వాళ్ల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామంటూ హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను.. కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ కోదండరాం సూచించారు. కృష్ణా నీటి వివాదంతో ప్రయోజనం పొందాలని చూశారని.. అది భగ్నమైందని కోదండరామ్ అభిప్రాయపడ్డారు. దౌర్జన్యం, దోపిడిపై తిరుగుబాటే ఈ సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు అంటూ వివరించారు. ఎగ్జిట్ పోల్స్ చూపినట్టే డిసెంబర్ 3న ఈ అధికార పార్టీని ఖచ్చితంగా సాగనంపుతారంటూ జోస్యం చెప్పారు.ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా వస్తాయని, ఇదొక అద్భుతమైన ప్రజా చైతన్యమంటూ కోదండరాం అభిప్రాయపడ్డారు. దోపిడీని అంతం చేసేందుకే తాము కాంగ్రెస్ కు మద్దతిచ్చామని.. ఇప్పడే కాదు ప్రజాస్వామ్య పాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని కోదండరాం చెప్పారు. ఉద్యమ కాలంలో తమకు ఏమైతే కావాలని పోరాటం చేశామో.. ఇప్పుడది నెరవేరేందుకు సమయం ఆసన్నమైందని అనిపిస్తుందన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రజలు ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని, ఇప్పటికే అలా పాల్పడే వారి ఇంటి ముందు ఆందోళనలు చేసేందుకు సిద్ధమై ఉన్నారనుకుంటున్నానని కోదండరాం వ్యాఖ్యానించారు.తెలంగాణ ఎన్నికల్లో టీజేఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.. కానీ ఎలాంటి సీట్లను కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ .. టీజేఎస్ పార్టీకి పలు స్పష్టమైన హామీలను ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవులతోపాటు.. కేబినెట్‌లో అవకాశం కల్పిస్తామని హామీనిచ్చింది. ఎన్నికల నోటిఫికెషన్ తర్వాత కోదండరాం తో సంప్రదింపులు జరిపిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే.. పలు హామీలను ఇచ్చారు. వాటికి అంగీకరించిన కోదండరాం కాంగ్రెస్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని తెలిపారు. దీనిలో భాగంగా కోదండరాం పలు ప్రచార సభల్లో కూడా పాల్గొని కాంగ్రెస్ కు ఓటెయ్యాలంటూ సూచించారు. ఈ క్రమంలో కోదండరాం చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.