హైదరాబాద్, డిసెంబర్ 9, (వాయిస్ టుడే): తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త సెక్రటేరియట్ లో మంత్రివర్గం సమావేశం నిర్వహించారు. సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 9 నుంచి రెండు గ్యారంటీలను అమలు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరక ముందే విపక్ష నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ప్రభుత్వంపై కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని, ఆరు నెలల్లోనే కూలిపోతుందని జోస్యం చెబుతున్నారు. ఏడాది ఓపిక పట్టాలని కడియం శ్రీహరి అంటే, కాంగ్రెస్ నేతల నుంచి ఫోన్లు వస్తున్నాయంటూ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే ఆరు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారా ? లేదంటే తమ ఎమ్మెల్యేలను చేర్చుకోండి చూద్దామంటూ ఉసి గొల్పేలా వ్యవహారిస్తున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మందిపై కేసులు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లేందుకు సాహసం చేసే అవకాశం ఉండదు. గతంలో ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో…అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇలాగే వ్యవహరించారు. టీడీపీ ఎమ్మెల్యేలు పలువురు టచ్ లో ఉన్నారని, తాను తలచుకుంటే ప్రభుత్వం పడిపోతుందంటూ హెచ్చరించారు. సీన్ కట్ చేస్తే, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఏపీలో లాగే బీఆర్ఎస్ నేతలు కూడా తమ ఎమ్మెల్యేలను చేర్చుకోండి అంటూ సవాల్ విసురుతున్నారా చర్చ జరుగుతోంది. పార్టీ కార్యకర్తలంతా ఒక్క ఏడాది ఓపిక పట్టాలని, ఏడాదిలోపే బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి ఏర్పాటు అవుతుందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి సంతాప సభలో ఈ కామెంట్స్ చేశారు. గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా గందరగోళంలో ఉన్నారన్న ఆయన, గులాబీ పార్టీకి 39 సీట్లు వచ్చాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షమైన ఎంఐఎం మద్దతు ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న కమలం పార్టీని కలుపుకొని, మరికొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమేమీ కాదన్నారు కడియం శ్రీహరి. ఏడాది వరకు ఓపిక పడితే పరిణామాలు ఎలా ఉంటాయో చూస్తారన్న ఆయన, సింహం తిరిగి వస్తుందన్నారు. బీఆర్ఎస్‌కు మంచి రోజులు వస్తాయన్న కడియం, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నందున తగాదాలు కొని తెచ్చుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. పార్టీ అధికారంలోకి రాలేదని ఎవరూ భయపడనవసరం లేదని, ఆరు నెలలా.. సంవత్సరమా, రెండేళ్లా, మూడేళ్లా, మళ్లీ ప్రభుత్వం మనదే.. మన ముఖ్యమంత్రి కేసీఆరేనని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారు పోయిందని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేరనే నిరాశలో కాంగ్రెస్ ఓటర్లు ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గత మూడు రోజులనుంచి ఇలాంటి సందేశాలు, వీడియోలు వస్తున్నాయని కార్యకర్తలకు వివరించారు. కాంగ్రెస్ నేతలు నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయని అన్నారు. ఓడిపోయామని బాధపడాల్సిన అవసరం లేదని, బాధ్యతాయుత విపక్షంగా పనిచేద్దామని అన్నారు. తెలంగాణ ప్రజలు 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారన్న కేటీఆర్.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం వారితో కలిసి పోరాడుతామని తెలిపారు. తెలంగాణ ప్రజానీకం తమను వదులుకోదని విశ్వాసం వ్యక్తం చేశారు.అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అన్నింటినీ తెలంగాణ ప్రజలు రాసిపెట్టుకున్నారన్న కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఏడాదికి మించి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదన్న ఆయన, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందన్నారు రాజాసింగ్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మరిన్ని అప్పులు చేయాలని తెలిపారు. కేసీఆర్ దిగిపోతూ రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశారని ఆరోపించారు. ఆ అప్పులు తీర్చలేక కాంగ్రెస్ నేతల్లో గందరగోళం మొదలవుతుందన్నారు. రాజ్యాంగాన్ని మార్చేస్తానన్న కేసీఆర్ ను ప్రజలు మార్చేశారని రాజాసింగ్ విమర్శించారు. ప్రజల్ని మోసం చేసిన కేసీఆర్‌ను ప్రజలు ఫామ్ హౌస్ కు పంపించేశారన్నారు.ఇలా కీలకమైన నేతలంతా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కామెంట్స్ చేస్తుండటంతో అసలు ఏం సందేశం ఇస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబొటీ మార్కులతో పాస్ అయింది. అంటే 65 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రేవంత్ రెడ్డిని సీఎంగా చేయడం కాంగ్రెస్‌లో ఉన్న ఓ వర్గం ఎమ్మెల్యేలకు ఇష్టం లేదనే చర్చ కూడా నడుస్తోంది. ఇటు విపక్షాలు అదే మాట చెప్పకనే చెబుతున్నాయి. కాంగ్రెస్‌లో అసంతృప్తులను మేనేజ్ చేసుకుంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమీ కాదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2014లో కూడా బీఆర్‌ఎస్ ఇలా బొటాబొటీ మెజార్టీతోనే అధికారంలోకి వచ్చింది. తర్వాత ఇతర పార్టీల నేతలను చేర్చుకొని 2018నాటికి బలపడింది. ఇదే సూత్రాన్ని కాంగ్రెస్ కూడా ఎందుకు అమలు చేయదూ అనే టాక్ కూడా నడుస్తోంది. ఏమైనా సరే విపక్షాల నుంచి వినిపిస్తున్న కామెంట్స్ మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. రానున్న భవిష్యత్‌లో ఎలాంటి పరిణామాలు చూస్తామో అన్న ఆసక్తి కూడా నెలకొంది. ఈ కామెంట్స్‌పై ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి మాత్రం రియాక్షన్ రాలేదు. దృష్టి రాజకీయాల కంటే పాలనపై పెట్టాలనే ఆలోచనలో ఉన్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని అంటున్నారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం కొలువు దీరక ముందు నుంచే తెలంగాణలో రాజకీయం షురూ అయింది.