గ్రూప్-4 పరీక్ష ఇప్పటికే జరగ్గా.. గ్రూప్-1 పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఇక.. గ్రూప్-3 పరీక్ష తేదీని ప్రకటించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో త్వరలోనే గ్రూప్-2తోపాటు గ్రూప్-3 పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించాలని టీఎస్‌పీఎస్సీ యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. టీఎస్‌పీఎస్సీపై తాజాగా సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి కమిషన్‌ను ప్రక్షాళన చేస్తామని ప్రకటించడం, కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి సహా సభ్యులు రాజీనామాకు సిద్ధపడటం చూస్తుంటే.. రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలు ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన గ్రూప్-2 పరీక్ష.. షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరుగడం కష్టమేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.తాజా పరిస్థితుల నేపథ్యంలో మూడోసారి రీ షెడ్యూల్ చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రంలో గ్రూప్-2 క్యాటగిరీ కింద 18 విభాగాల్లో 783 పోస్టుల భర్తీకి గత డిసెంబర్ 29న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 5,51,943 మంది దరఖాస్తు చేశారు. సగటున ఒకో ఉద్యోగానికి 705 మంది పోటీలో ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు 29, 30 తేదీల్లోనే నిర్వహించాల్సి ఉండగా, అదే నెలలో మరికొన్ని పరీక్షలు ఉండటంతో పరీక్షను వాయిదా వేసి, మరికొంత సమయం ఇవ్వాలని అభ్యర్థులు కోరారు. పరీక్షను వాయిదా వేసిన కమిషన్.. నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈలోపే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో మరోమారు వాయిదా పడింది.



