కాళేశ్వరంలో కలకలం….
కరీంనగర్, జనవరి 2,
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కాళేశ్వరం కలకలం రేపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు బండారాన్ని బయట పెట్టడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో భాగస్వాములైన కీలక కాంట్రాక్టర్లు, అధికారుల గుండెల్లో అజలడి మొదలైంది. లక్ష కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని, ప్రాజెక్టు డిజైన్‌లో లోపాల వల్ల, నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం వల్ల ఈ ప్రాజెక్టుకు మున్ముందుకూడా ఎన్నో సమస్యలు ఎదురుకానున్నాయని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇది ఒక ప్రధాన అంశం కావడంతోపాటు, కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పలువురు కీలక మంత్రులు ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద డిసెంబర్ 29 శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కీలక మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు.. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పించి.. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న లోపాలను మరోసారి బహిరంగంగా ఎత్తిచూపారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు చేసిన వ్యాఖ్యలు చూస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కింగ్‌పిన్‌గా వ్యవహరించిన కాంట్రాక్టర్‌పై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే పంప్‌సెట్లను స్థానికంగా అసెంబుల్ చేయించి, నాలుగు వేల కోట్ల రూపాయల చొప్పున వసూలు చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపణలకు తోడు, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మరో బాంబు పేల్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్ గత ఏడాది వచ్చిన గోదావరి వరదలకు మునుగిపోయి, మొత్తం 17 మోటార్లు దెబ్బతిని, ఇందులో ఆరు మోటార్లు పూర్తిగా నాశనం కాగా… వీటి మరమ్మతుకు కావాల్సిన 12 వందల కోట్ల రూపాయల ఖర్చును ఈ పంప్‌హౌస్ నిర్మించిన కాంట్రాక్టరే భరిస్తారని, ‘డిఫెక్ట్ లయబిలిటీ’లో భాగంగా, ఈ బాధ్యత కాంట్రాక్టర్‌దేనని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనకు విరుద్ధంగా, పంప్‌హౌస్ రిపేర్ బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్ దరఖాస్తు చేశారని, ఇది పెండింగ్‌లో ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. సముద్ర మట్టానికి 126 మీటర్ల ఎగువన పంప్‌హౌస్ నిర్మించాల్సివుండగా, 110 మీటర్ల ఎగువన మాత్రమే పంప్‌హౌస్ నిర్మించారని కూడా మంత్రి శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తావించారు. అంటే… దాదాపు 50 అడుగుల తక్కువ ఎత్తులో పంప్‌హౌస్ నిర్మించారు. దీంతో అసలు ప్రాజెక్ట్ డిజైన్ విషయంలో లోటుపాట్లు జరిగాయా అనే అంశంపై చర్చ మళ్లీ మొదలైంది.ఈ సందర్భంగా గుర్తించుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటంటే… దాదాపు లక్ష కోట్ల రూపాయల వ్యయమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి… ఇప్పుడు వార్తల్లోకి వచ్చిన మూడు బ్యారేజీల నిర్మాణ ఖర్చు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే. అంటే మొత్తం ప్రాజెక్టు వ్యయంలో, బ్యారేజీల కాంపోనెంట్ పది శాతానికి లోపే ఉంది. అంటే ప్రాజెక్టు వ్యయంలో సింహభాగం ఖర్చయింది ఇతర ప్యాకేజీల మీదే.. అవి కూడా కాంట్రాక్టర్‌కు బాగా లాభదాయకమైన ప్యాకేజీలే అని మంత్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పలు కీలక అంశాలపై విచారణకు రంగం సిద్ధమవుతోంది.
అవి ఏంటంటే..
1. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు డిటైల్డ్ డిజైనింగ్, ఇరిగేషన్ శాఖ అధికారుల పర్యవేక్షణలో జరిగిందా? లేదా? కింగ్‌పిన్ కాంట్రాక్టర్ కనుసన్నల్లో జరిగిందా?
2. ప్రాజెక్టు కాంట్రాక్టు మొత్తాన్ని వివిధ ప్యాకేజీలుగా విభజించడం వెనుక కీలకపాత్ర పోషించింది ఎవరు?
3. ప్రాజెక్టులో విలువైన, అత్యంత లాభదాయకమైన ప్యాకేజీలను కింగ్‌పిన్ కాంట్రాక్టర్ దక్కించుకున్నారా?
4. వివిధ ప్యాకేజీల టెండర్ల నిబంధనలను తనకు అనుకూలంగా రూపొందించడంలో కింగ్‌పిన్ కాంట్రాక్టర్ కీలకపాత్ర పోషించారా?
5. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించినట్లు… వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే అసెంబుల్డ్ పంప్‌సెట్స్‌కు నాలుగు వేల కోట్ల రూపాయల చొప్పున సొమ్ము చేసుకున్నారా? ఇందులో ఎవరి వాటా ఎంత?
6. డిఫెక్టు లయబిలిటీలో భాగంగా రిపేరు చేయాల్సిన బాధ్యత ఉన్న కాంట్రాక్టర్… మరి ఆ బిల్లులను ప్రభుత్వానికి ఎందుకు సమర్పించారు? ఇందులో ఎన్ని బిల్లులు ప్రభుత్వం చెల్లించింది?
7. నిర్మించాల్సిన దానికంటే 50 అడుగుల దిగువన పంప్‌హౌస్‌లను డిజైన్ చేసిన పాపం ఎవరిది? కాసులకు కక్కుర్తిపడి ఇలా చేశారా? లేదా? ఇంజనీరింగ్ నైపుణ్యం లేకుండానే డిజైన్ చేశారా?
ఈ అంశాలన్నింటిలో నిజానిజాలు బయటపడాలంటే… కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని ఇంజనీరింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో పిల్లర్లు కుంగిన నేపథ్యంలో… ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేలా సీబీఐని సీరియస్ ఫ్రాడ్స్ ఇన్వెస్టిగేషన్ సంస్థనూ ఆదేశించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల కాలంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) కార్యాలయం కూడా విస్తృతంగా అధ్యయనం చేసి, ఒక నివేదికను తయారు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగ్ నివేదికలో మరిన్ని వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ పరిణామాలన్నీ కింగ్‌పిన్ కాంట్రాక్టర్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో చేపట్టిన వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టు కాంట్రాక్టుల్లో రింగ్‌మాస్టర్ పాత్ర పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కింగ్‌పిన్ కాంట్రాక్టర్… గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే… రాగల మార్పును పసిగట్టారు. అంతేకాదు… అధికార మార్పిడితో రాగల ఇతర మార్పులను దృష్టిలో ఉంచుకుని, ముందుజాగ్రత్త చర్యగా కొందరిని ప్రసన్నం చేసుకునే పనిని కూడా ఎన్నికలకు ముందే నిర్వర్తించారు.అయితే.. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు, ఆయన మంత్రివర్గంలోని పలువురు కీలక మంత్రులు బలంగా నమ్ముతున్నారు. కాళేశ్వరంపై న్యాయవిచారణ జరిపించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే స్వయంగా ప్రకటించారు. ముఖ్యమంత్రితోపాటు కీలక మంత్రులు అందరికీ ఈ విషయంపై మంచి “పట్టు” ఉండటమే కాక, ఈ వ్యవహారంలో నిజం నిగ్గు తేల్చాలన్న పట్టుదల కూడా ఉంది. దీనికితోడు, ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ కూడా పెండింగ్‌లో ఉంది. ఇదంతా సీరియస్‌గా జరిగితే మాత్రం… కింగ్‌పిన్ కాంట్రాక్టర్‌కు కష్టకాలం రాకమానదు.! మేనేజ్‌మెంట్ కళలో ఆరితేరిన కింగ్‌పిన్ కాంట్రాక్టర్… ఈ ముప్పును ఏ విధంగా మేనేజ్ చేస్తారో చూడాలి!
కాళేశ్వరంలో కలకలం….
- Advertisement -
- Advertisement -