ఏపీలో మళ్లీ 2014 పొత్తులు రిపీట్. టీడీపీ-బీజేపీ-జనసేన అధినాయకత్వాల మధ్య జరుగుతున్న పొత్తులు..కొన్ని నియోజకవర్గాలపైనే కమలం పార్టీ గురి.!
చంద్రబాబు- పవన్ వేర్వేరుగా ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో జరుపుతున్న చర్చలు ఫలించి పొత్తులు కుదిరే అవకాశం ఉంది.
దీంతో బీజేపీ టికెట్లు ఆశిస్తున్న నియోజకవర్గాల్లో మిగతా పార్టీల ఆశావహుల్లో కలవరం మొదలైంది.
టీడీపీ-బీజేపీ-జనసేన అధినాయకత్వాల మధ్య జరుగుతున్న చర్చల్లో పొత్తులపై స్పష్టత వస్తే ఏఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ వాళ్లు పోటీ చేయాలనే అంశం వెంటనే తెరపైకి వస్తుంది.
ఇప్పటికే టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై ఓ అంగీకారం కుదరినట్లు సమాచారం.
అయితే తాజా చర్చల్లో బీజేపీ అధిష్టానం ఏపీ నుంచి 8 ఎంపీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్లు తెలిసింది.
గతంలో గెలుచుకున్న విశాఖ, నరసాపురం నియోజకవర్గాలతో పాటు అరకు, విజయవాడ, రాజంపేట, హిందూపురం, ఒంగోలు, నరసరావుపేట నియోజకవర్గాలను బీజేపీ కోరుకుంటున్నట్లు తెలిసింది.
విశాఖ నుంచి పురంధేశ్వరి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. నరసాపురం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీకి రఘురామ ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. విజయవాడ నుంచి బీజేపీ అభ్యర్థిగా సుజనా ఉండే అవకాశం ఉంది. రాజంపేట బరిలో మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి లేదా సత్యకుమార్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. హిందూపురం నుంచి విష్ణువర్థన్‌రెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పార్లమెంట్ నియోజకవర్గాలు కాకుండా 25 ఎమ్మెల్యే స్థానాలు కూడా బీజేపీ కోరుకుంటోంది. దీంతో ఈ నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశించిన టీడీపీ, జనసేన ఆశావహుల్లో గుబులు మొదలైంది. భారీ సంఖ్యలో ఉన్న ఆశావహుల్ని బుజ్జగించడం టీడీపీ-జనసేనకు సవాలుగా మారనుంది.
ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు- బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు అమిత్ షాతో చర్చలు జరిపారు. పవన్ కూడా బీజేపీ అధిష్టానంతో చర్చలు జరపబోతున్నారు. పవన్ చర్చల తర్వాత టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుపై స్పష్టమైన ప్రకటన వెలువడవచ్చని తెలుస్తోంది.