పోచారం, సంజయ్‌పై అనర్హత వేటుకు ప్రయత్నం..
హైదరాబాద్
పార్టీ మారుతోన్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం బీఆర్ఎస్ పార్టీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందులోభాగంగా తాజాగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని తెలంగాణ స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అందుకోసం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద కుమార్ అపాయింట్‌మెంట్‌ను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కోరారు. అయితే స్పీకర్ అందుబాటులో లేరని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నేరుగా స్పీకర్ నివాసానికి వెళ్లి వీరిపై అనర్హత వేటుకు చర్యలకు ఉపక్రమించాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలుస్తుంది.
గతేడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరింది. అనంతరం రేవంత్ రెడ్డి చేపట్టి ఆపరేష్ ఆకర్ష్‌లో బీఆర్ఎస్ పార్టీలోని అగ్రనేతలంతా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కట్టారు. ఆ క్రమంలో తాజాగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి.కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో వీరిపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్‌ను బీఆర్ఎస్ పార్టీ కోరనుంది.