ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 151 సీట్లతో అధికారంలో ఉన్న వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లను మాత్రమే గెల్చుకుని ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది. ఇంత దారుణ ఓటమిని పార్టీ నేతలెవ్వరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వైసీపీ ఓటమిని పార్టీ అధినేత జగన్ సైతం ఊహించలేకపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ సైలెంట్ అయిపోయారు. ఎన్నికల ఫలితాలు తర్వాత పార్టీ నాయకులతో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్నారు.
ఓటమి తర్వాత తన సొంత నియోజకవర్గం అయిన పులివెందులలో మూడు రోజులు పర్యటన చేశారు. ఆ తర్వాత అటు నుంచి బెంగుళూరులోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ నుంచే తన రాజకీయ వ్యూహాలకు జగన్ పదును పెట్టారు. తాను పూర్తిగా ప్రజల్లోకి వచ్చే విధంగా జిల్లాల పర్యటనకు జగన్ సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ డిసైడ్ అయ్యారు. ముందుగా పార్టీ నేతలు కేడర్‌ను పరామర్శించేందుకు జగన్ సిద్ధమయ్యారు.ఈ మేరకు జగన్ ఈరోజు (గురువారం) తొలి అడుగు ముందుకు వేయనున్నారు. దీనిలో భాగంగానే ఈరోజు (గురువారం) నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జగన్ ఓదార్చనున్నారు.
ఈవీఎం ధ్వంసం, టీడీపీ ఏజెంట్ , మహిళపై దాడి, కారంపూడి సిఐపై హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు. మాచర్ల కోర్టు 14 రోజుల రిమాండ్ ను విధించింది దీంతో పిన్నెల్లి నెల్లూరు సెంట్రల్ జైలుకు పంపారు. గురువారం జైలుకు వెళ్లి మరీ పిన్నెల్లిని జగన్ పరామర్శించనున్నారు. అనంతరం జగన్ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్ పార్టీకి జిల్లా ప్రజలు పట్టం కట్టారు. 10కి 10 స్థానాలు గెలిచి వైసీపీ చరిత్ర సృష్టించింది. అలాంటి జిల్లాలో ఈసారి వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. దీంతో జగన్ జిల్లా నాయకత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు.
జగన్ జైలుకు..?
- Advertisement -
- Advertisement -