- Advertisement -
గతం కన్నా మిన్నగా శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు- టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు
Srivari Brahmotsava arrangements better than last- TTD EO Shri J. Shyama Raoతిరుమల,
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ఈవో జె. శ్యామలరావు చెప్పారు. భక్తుల సౌకర్యార్థం టిటిడిలోని అన్ని విభాగాల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం ఈవో, అదనపు ఈ ఓ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఏడాది అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ఉదయం వాహనసేవ 8 నుండి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుండి 9 గంటల వరకు జరుగుతుంది. గరుడవాహన సేవ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ విశేష ఉత్సవాలను తిలకించేందుకు విచ్చేసే భక్తకోటికి టీటీడీ అనేక ఏర్పాట్లను చేసింది. అక్టోబరు 04న ముఖ్యమంత్రి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అదేవిధంగా అక్టోబర్ 5వ తేదీ ముఖ్యమంత్రి తిరుమల పాంచజన్యం విశ్రాంతి భవనం వెనుక వైపున రూ.13.45 కోట్లతో నూతనంగా అత్యాధునిక పరికరాలతో నిర్మించిన వకుళమాత కేంద్రీయ వంటశాలను ప్రారంభిస్తారని అన్నారు.
భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జితసేవలు రద్దు చేసాం. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 7 లక్షల లడ్డూలను నిల్వ ఉంచాం.- భక్తుల సౌకర్యార్థం లడ్డూ కౌంటర్లను 2023లో 54 ఉండగా 2024లో 65, అంటే 11 అదనంగా ఏర్పాటు చేశాం. – వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రత్యేక దర్శనాలు రద్దు చేసాం. బ్రేక్ దర్శనం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం. గరుడసేవ రోజు అక్టోబరు 8న బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు అయ్యాయి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 1.32 లక్షల రూ.300/` దర్శన టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాం. తిరుపతిలో ప్రతిరోజూ సర్వదర్శనం టోకెన్లు 24 వేలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.
రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా తిరుమల, నడకమార్గాల్లో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో భక్తులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందిస్తాం. తిరుమలలో సామాన్య భక్తుల కోసం 6,282 గదులు అందుబాటులో ఉన్నాయి. సాధారణ రోజుల్లో 1,580 గదులు ఆన్లైన్లో భక్తులకు కేటాయిస్తారు. బ్రహ్మోత్సవాల్లో వీటిని 50 శాతానికి తగ్గించడం జరిగింది. విఐపి ఏరియాలో 1,353 గదులు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలోని గదుల్లో దాదాపు 40 వేల మంది భక్తులు బస చేసే అవకాశముంది. పిఏసి -1, 2, 3, 4లలో కలిపి 28 హాళ్లలో దాదాపు 6700 లాకర్లు ఉన్నాయి. దాదాపు 20 వేల మంది భక్తులు బస చేయవచ్చని అయన అన్నారు. ఈ సమావేశంలో జేఈవోలు గౌతమి, వీర బ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, సి సత్యనారాయణ, ఆలయ డిప్యూటీవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




