Tuesday, December 24, 2024

లక్కీ భాస్కర్’ చూసిన ప్రతి ఒక్కరూ సినిమా బాగుందని చెప్పడం అదృష్టంగా భావిస్తున్నాను: దర్శకుడు వెంకీ అట్లూరి

- Advertisement -

లక్కీ భాస్కర్’ చూసిన ప్రతి ఒక్కరూ సినిమా బాగుందని చెప్పడం అదృష్టంగా భావిస్తున్నాను: దర్శకుడు వెంకీ అట్లూరి

People saying 'Lucky Bhaskar' says the film is good: Director Venky Atluri

‘మహానటి’, ‘సీతారామం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన హ్యాట్రిక్ చిత్రం ‘లక్కీ భాస్కర్’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని నిర్మించారు. ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా థియేటర్లలో అడుగుపెట్టిన ‘లక్కీ భాస్కర్’, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ‘సార్’ వంటి ఘన విజయం తర్వాత వెంకీ అట్లూరి-సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కాంబినేషన్ లో వరుసగా మరో బ్లాక్ బస్టర్ నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘లక్కీ భాస్కర్’ విజయం ఎలాంటి సంతృప్తిని ఇచ్చింది?
చాలా చాలా సంతృప్తిని ఇచ్చింది. అందరూ కథ విని బాగుంది అన్నారు. కొందరు మాత్రం కథ బాగుంది కానీ, కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా అనే సందేహం వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ అవుతుందని భరోసా ఇచ్చారు. నా మొదటి సినిమా ‘తొలిప్రేమ’ విజయం సాధించినప్పటికీ, ఒక ఐదు శాతం మంది ప్రేమకథే కదా అన్నట్టుగా కాస్త నెగటివ్ గా మాట్లాడారు. కానీ ‘లక్కీ భాస్కర్’కి మాత్రం ఒక్క శాతం కూడా అలాంటి నెగటివ్ స్పందన రాలేదు. ప్రీమియర్ల నుంచే అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు, రివ్యూ రైటర్లు అందరూ సినిమా బాగుంది అన్నారు. ఒక సినిమాని ఇలా చూసిన వారందరూ బాగుందని చెప్పడం నిజంగా గొప్ప విషయం. అదృష్టంగా భావిస్తున్నాను.
సినిమాలో ఫలానా సన్నివేశం బాగుందనో లేదా ఫస్ట్ హాఫ్ బాగాందనో, సెకండాఫ్ బాగుందనో అంటారు. కానీ లక్కీ భాస్కర్ విషయంలో మాత్రం అందరూ సినిమా మొత్తం బాగుంది అనడం ఎలా అనిపించింది?
నేను సాధారణ ప్రేక్షకులతో కలిసి సినిమా చూసినప్పుడు.. ప్రతి సన్నివేశానికి, ప్రతి సంభాషణకి వారి నుంచి వచ్చిన స్పందన చూసి చాలా చాలా సంతోషం కలిగింది. కొన్ని సంభాషణలు అప్పటికప్పుడు చిత్రీకరణ సమయంలో రాయడం జరిగింది. వాటికి కూడా ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభించింది.
కథ విన్న తర్వాత దుల్కర్ గారి మొదటి స్పందన ఏంటి?
ఫస్ట్ హాఫ్ వినగానే ఈ సినిమా నేను చేస్తున్నాను అని దుల్కర్ చెప్పారు. షూటింగ్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఎన్నిరోజుల డేట్స్ కావాలి? అని అడిగారు. ‘లక్కీ భాస్కర్’ విజయం సాధిస్తుందని దుల్కర్ బలంగా నమ్మారు.
సెట్ లో దుల్కర్ ఎలా ఉండేవారు?
సినిమా సెట్ లో హీరోనే మెయిన్ పిల్లర్. హీరో డల్ గా ఉంటే సెట్ మొత్తం డల్ గా ఉంటుంది. దుల్కర్ ఉదయం రావడమే ఫుల్ ఎనర్జీతో వచ్చేవారు. ఆయన ఈ కథని నమ్మడం వల్ల, సెట్ లో అంత సంతోషంగా ఉండటం వల్లే ఇంతమంచి అవుట్ పుట్ వచ్చింది. సన్నివేశాలు, సంభాషణలు చదివి బాగున్నాయని అభినందించే వారు. దాని వల్ల మరింత ఉత్సాహంగా ఇంకా మెరుగ్గా రాసేవాడిని.
నాగవంశీ గారు విడుదలకు ముందు ఇందులో తప్పు చూపిస్తే పార్టీ ఇస్తా అన్నారు కదా.. మొదటి నుంచి ఆయన అంతే నమ్మకంతో ఉన్నారా?
మొదట కథ రాసుకున్నప్పుడు ఇంత భారీ సినిమా అవుతుందని నేను అనుకోలేదు. నిజమైన లొకేషన్స్ లో షూటింగ్ చేసి, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయొచ్చనే ఆలోచనలో ఉన్నాను. కానీ వంశీ గారు ఈ కథని ఎంతో నమ్మారు. కథకి తగ్గ భారీతనం తీసుకురావడం కోసం సెట్లు వేయాలని నిర్ణయించారు. కథని అంతలా నమ్మారు కాబట్టే వంశీ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని భారీస్థాయిలో నిర్మించారు.
సీనియర్ నటులు రాంకీ గారు, బెనర్జీ గారిని తీసుకోవాలని ఎందుకు అనిపించింది?
ఒక ప్రముఖ నటుడు చాలా రోజుల తర్వాత సినిమాలో కనిపిస్తే మనకి తెలియని ఆనందం కలుగుతుంది. ఆ ఉద్దేశంతో రాంకీ గారిని, బెనర్జీ గారిని తీసుకోవడం జరిగింది. పైగా ఆ రెండూ ప్రాముఖ్యత ఉన్న పాత్రలే. ఆ పాత్రలకు కొత్తదనంతో పాటు బలం తీసుకు రావాలంటే వాళ్ళిద్దరు కరెక్ట్ అనిపించారు. దుల్కర్ అందంగా ఉంటారు. బెనర్జీ గారు కూడా అందంగా ఉంటారు. ఇద్దరూ తండ్రీకొడుకులుగా చూడటానికి బాగుంటారు అనే ఉద్దేశంతో కూడా బెనర్జీ గారిని తీసుకోవడం జరిగింది.
బ్యాంకింగ్ నేపథ్యం కదా.. కథ రాసేటప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకున్నారు?
ఎంతో రీసెర్చ్ చేశాను. కొన్ని సిరీస్ లు చూశాను. అయితే అవి టెక్నికల్ గా సాధారణ ప్రేక్షకులు అర్థం చేసుకునేలా లేవు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకొని.. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా ప్రతి సన్నివేశాన్ని రాసుకోవడం జరిగింది.
ఎడిటర్ నవీన్ నూలి గురించి?
సినిమాలు ఎడిట్ టేబుల్ మీద తయారవుతాయని భావిస్తాను. నవీన్ తో తొలిప్రేమ సినిమా నుంచి ట్రావెల్ అవుతున్నాను. నవీన్ ని ఎంతో నమ్ముతాను. ఏదైనా తప్పు అనిపిస్తే నిర్మొహమాటంగా చెప్తాడు. ఎడిటర్ గా లక్కీ భాస్కర్ కి పూర్తి న్యాయం చేశాడు. ఈ సినిమా ఎడిటింగ్ గురించి అందరూ అందుకే అంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు.
లక్కీ భాస్కర్ విషయంలో వచ్చిన గొప్ప ప్రశంస ఏంటి?
ఒక్కటని కాదు, ఒక్కరని కాదు. అందరూ సినిమా బాగుందని ప్రశంసిస్తున్నారు.
ఈ సినిమాపై త్రివిక్రమ్ గారి ప్రభావం ఏమైనా ఉందా?
ఈ సినిమా విషయంలో ఒక నిర్మాతగా ఏం చేయాలో అదే చేశారు. ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే ఇస్తారు కానీ, ప్రభావితం చేసే ప్రయత్నం చేయరు. అయితే ఒక అభిమానిగా నా ప్రతి సినిమాపై త్రివిక్రమ్ గారి ప్రభావం ఎంతో కొంత ఉంటుంది.
మీ తదుపరి చిత్రం ఎలా ఉండబోతుంది?
ఏ జానర్ సినిమా చేయాలనే నిర్ణయానికి ఇంకా రాలేదు. ప్రస్తుతం కొన్ని కథా ఆలోచనలు ఉన్నాయి. ఖచ్చితంగా మరో మంచి చిత్రంతో అలరించడానికి ప్రయత్నిస్తాను.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్