స్థానిక పత్రికలకు అక్రిడిటేషన్లను నిలుపుదల చేయవద్దు
–వెరిఫికేషన్ పేరుతో వేధింపులు ఆపాలి
— ఐ & పిఆర్ డిడికి పలు జర్నలిస్టు సంఘాల వినతి
Don’t withhold accreditations for local newspapers.
విశాఖపట్నం, ఫిబ్రవరి 3:
సర్కులేషన్ 5వేలు దాటిన స్థానిక పత్రికలకు వెరిఫికేషన్(పరిశీలన) చేసిన తర్వాతే ప్రెస్ అక్రిడిటేషన్లను జారీ చేయాలనే నిర్ణయాన్ని విరమించుకోవాలని పలు జర్నలిస్టు సంఘాల నేతలు సమాచార ,పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె. సదారావుకు వినతి పత్రం అందజేశారు. నగరంలోని జిల్లా పరిషత్ జంక్షన్ లో గల ఆయన కార్యాలయంలో బుధవారం కలిసి చర్చించారు. రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ వెరిఫికేషన్ పేరుతో అక్రిడేషన్లు నిలుపుదల చేయటం లేదని విశాఖ జిల్లాలో ఈ రకమైన వేధింపులు తగవన్నారు. గత సంవత్సరం, అంతకు ముందు ఇదే రకంగా వెరిఫికేషన్ చేశారని మరో సారి వెరిఫికేషన్ దేనికని ప్రశ్నించారు. నిబంధనలు చిన్న పేపర్లకేనా మిగతా వాటికి వర్తించవా అని ప్రశ్నించారు. 5వేలు దాటిన చిన్న పత్రికలను వెరిఫికేషన్ చేయాలనే విషయం జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీలో సమగ్రంగా చర్చించకుండా కమిటీ సభ్యులుగా ఉన్న జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టుల ఆమోదం లేకుండా వెరిఫికేషన్ తగదన్నారు. సమాచార శాఖ అధికారుల ఉద్దేశాలను కమిటీపై రుద్ద వద్దని హితవు పలికారు. గత ప్రభుత్వం అక్రిడేషన్లు తగ్గించిందని తమ ప్రభుత్వం అక్రిడేషన్లు పెంచుతామని హామీ ఇచ్చి తీరా జీవో నెంబర్ 84 ద్వారా పెంచకపోగా తగ్గాయన్నారు. వాటిని కూడా లేకుండా చేయటం అన్యాయమని ఆయనకు తెలిపారు సర్కులేషన్ 5వేలు అయినా అంతకు మించినప్పటికీ వెరిఫికేషన్ ఆలోచనను వెనక్కి తీసుకుని రెగ్యులారిటీ కలిగిన పత్రికలకు ప్రెస్ అక్రిడేషన్లు జారీ చేయాలని కోరారు. దీనిపై డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ కలెక్టర్ దృష్టిలో ఉంచి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. డిడి ని కలిసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ,మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు కె .రాము, లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి .సత్యనారాయణ, ఏపీయూడబ్ల్యూజే గాజువాక యూనిట్ అధ్యక్షుడు కె . పరశురాం, అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొల్లి కమల్ కుమార్,ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ప్రతినిధి రవికుమార్, సీనియర్ జర్నలిస్టు హరినాథ్, లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కడలి రాజేంద్రప్రసాద్, ఎం. శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.



