ప్రముఖ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ మృతికి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీవ్ర సంతాపం
The Telangana Film Development Corporation expresses deep condolences over the demise of renowned director and actor K. Bhagyaraj.
హైదరాబాద్, జూన్ 27 (వాయిస్ టుడే):
తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో దర్శకుడు, నటుడు, కథా రచయిత, స్క్రీన్‌ప్లే రచయితగా విశిష్ట సేవలు అందించి భారతీయ చలనచిత్ర రంగంలో చెరగని ముద్ర వేసిన ప్రముఖ సినీ దిగ్గజం కె. భాగ్యరాజ్ మృతి పట్ల తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, మేనేజింగ్ డైరెక్టర్ మరియు సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ డాక్టర్ జి. ముకుంద రెడ్డి సంయుక్త ప్రకటనలో ప్రగాఢ సంతాపం తెలిపారు.
భారతీయ సినీ రంగంలో తనదైన కథన శైలి, వినూత్న ఆలోచనలు, అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో ప్రత్యేక గుర్తింపు పొందిన భాగ్యరాజ్‌ను సినీ ప్రపంచం “కింగ్ ఆఫ్ స్క్రీన్‌ప్లే”గా గౌరవించిందని పేర్కొన్నారు. దర్శకుడిగా, రచయితగా, నటుడిగా ఆయన రూపొందించిన అనేక చిత్రాలు ప్రేక్షకాదరణ పొందడమే కాకుండా సినీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా నిలిచాయని తెలిపారు.
తమిళ సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆయనకు విశేష ఆదరణ ఉందని, ఆయన చిత్రాలు కుటుంబ కథా చిత్రాలకు కొత్త దిశను చూపించాయని పేర్కొన్నారు. కథన నిర్మాణంలో ఆయన చూపిన నైపుణ్యం, పాత్రల రూపకల్పనలోని సహజత్వం, సామాజిక అంశాలను వినోదాత్మకంగా ఆవిష్కరించే ప్రతిభ ఆయనను ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయని తెలిపారు.
సినీ రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, భారతీయ చలనచిత్ర చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. భాగ్యరాజ్ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని, ఆయన లేని లోటును భర్తీ చేయడం కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కె. భాగ్యరాజ్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు, తమిళ సినీ పరిశ్రమకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.




