తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: సీఎం రేవంత్‌రెడ్డి
రెండున్నరేళ్ల ప్రజా పాలనలో పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశాం
హైదరాబాద్, ఆగస్టు 15: గత రెండున్నరేళ్ల ప్రజా పాలనలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశామని, భవిష్యత్ తెలంగాణ నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలు, ఉద్యోగుల భాగస్వామ్యంతోనే ప్రజా ప్రభుత్వం సాధించిన ప్రతి విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. భగవంతుడి ఆశీస్సులు, ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసి తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సీఎం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పేదల ఆర్థిక పురోగతికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు స్పష్టమైన దార్శనికత, పకడ్బందీ ప్రణాళికలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆయన వివరించారు.
తెలంగాణ రైజింగ్-2047
గత 32 నెలల్లో ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో నాలుగు కోట్ల ప్రజలకు భరోసా కల్పించిందని సీఎం తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు సామాజిక న్యాయంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించామని చెప్పారు.
భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతికత, నైపుణ్యాలపై బలమైన పునాదులు వేశామని, సాధించిన విజయాల ఆధారంగా తెలంగాణను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడమే ‘తెలంగాణ రైజింగ్-2047’ లక్ష్యమని తెలిపారు.
ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే ఇది దాదాపు 91 శాతం అధికమని సీఎం పేర్కొన్నారు.
రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నమ్మకంతో రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయాలనే లక్ష్యంతో చేపట్టిన చర్యల ఫలితంగా వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో తెలంగాణ పంజాబ్‌ను అధిగమించిందని తెలిపారు.
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా సాధించే విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేశారు. తుమ్మడిహెట్టి నుంచి పాలమూరు వరకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని చెప్పారు.
కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
తెలంగాణలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని సీఎం తెలిపారు. సన్నబియ్యం పథకం పేదల ఆరోగ్యం, ఆత్మగౌరవానికి భరోసా కల్పించే విప్లవాత్మక కార్యక్రమమని పేర్కొన్నారు.
93 లక్షలకు పైగా కుటుంబాలు, సుమారు 3.38 కోట్ల మంది ప్రజలను ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు భరోసా కల్పిస్తూ 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తున్నామని, కొత్త సాంకేతికతతో రేషన్ పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచుతున్నామని చెప్పారు.
పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టామని, తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు సహా 43 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నామని వివరించారు.
కార్మికులకు అండగా ప్రభుత్వం
12 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణను ప్రజా ప్రభుత్వం ఆమోదించిందని సీఎం తెలిపారు. దీంతో సుమారు కోటి 11 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. దేశంలోనే ఆదర్శంగా గిగ్ కార్మికుల సంక్షేమ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు.
విద్య, ఉద్యోగ రంగాల్లో సంస్కరణలు
విద్యారంగంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరిందన్నారు.
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడాన్ని ప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుందని చెప్పారు. ఇప్పటివరకు ప్రభుత్వ శాఖల్లో 72 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని తెలిపారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, మెగా డీఎస్సీ నియామకాలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు.
నోటిఫికేషన్ జారీతో ప్రక్రియను నిలిపివేయకుండా పరీక్షలు, ఫలితాలు, ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించామని చెప్పారు. టీజీపీఎస్సీ ద్వారా 456 వివిధ పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు.
ప్రభుత్వ వైద్యరంగం బలోపేతం
ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు పలు చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. గోషామహల్లో 2,000 పడకల నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టామని, వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో మూడు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
కొత్తగా 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించామని, మరో 8 మెడికల్ కాలేజీలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. 16 కొత్త నర్సింగ్ కాలేజీలతో పాటు 28 పారా మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు.
డ్రగ్స్, ఆహార కల్తీపై ఉక్కుపాదం
డ్రగ్స్, ఆహార కల్తీపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు కొత్తగా ‘టీజీ సేఫ్’ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆహార కల్తీ నియంత్రణ, డ్రగ్స్ నియంత్రణను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తామని, ప్రత్యేక లీగల్, ల్యాబొరేటరీ, ఎన్ఫోర్స్మెంట్ విభాగాల సమన్వయంతో విస్తృత తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఉద్యోగులు ప్రభుత్వ విజయాల్లో కీలక భాగస్వాములు
ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు కీలక భాగస్వాములని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం నుంచి సంక్షేమ పథకాలను చివరి లబ్ధిదారుడికి చేర్చడం వరకు, పెట్టుబడులను ఆకర్షించడం నుంచి ప్రభుత్వ సేవలను విస్తరించడం వరకు ఉద్యోగులు, అధికారుల సహకారం కీలకమని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ఆగస్టు 17 నుంచి రాష్ట్రంలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, త్వరలో ప్రజావాణి ఆన్లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించి ఎక్కడి నుంచైనా అర్జీలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు.
ప్రపంచంతో పోటీపడుతున్న తెలంగాణ
తెలంగాణ పోటీ ఇతర రాష్ట్రాలతో కాదని, ప్రపంచంతోనే పోటీ పడుతోందని సీఎం అన్నారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల నిర్మాణానికి కార్యాచరణ ప్రారంభించామని తెలిపారు. ప్రజా పాలనలో జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు తెలంగాణపై నమ్మకం పెరిగిందని చెప్పారు.
బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్‌లో బిజినెస్ ఎంట్రీ, కన్స్ట్రక్షన్ పర్మిట్ ఎనేబ్లర్స్, సర్వీస్ సెక్టార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో తెలంగాణ టాప్ అచీవర్‌గా నిలవడం ఇందుకు నిదర్శనమన్నారు. ఈ ఏడాది కూడా ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెబుతామని వెల్లడించారు.
ఐటీ రంగంలో దూసుకెళ్తున్న తెలంగాణ
2025-26లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లకు చేరాయని సీఎం తెలిపారు. ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాల సంఖ్య 12.14 లక్షలకు పెరిగిందన్నారు. హైదరాబాద్‌లో 355కు పైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు పనిచేస్తున్నాయని, 2026లో కొత్తగా 40 గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు హైదరాబాద్‌కు వచ్చాయని వివరించారు.
డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో తెలంగాణ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న గమ్యస్థానాల్లో ఒకటిగా మారుతోందన్నారు. అమెజాన్ తెలంగాణలో అదనంగా 7 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించిందని తెలిపారు.
భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్వెల్లి ప్రాంతాల్లో దేశంలోని అతిపెద్ద హైపర్‌స్కేల్, ఏఐ-రెడీ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్‌లలో ఒకటి రూపుదిద్దుకుంటోందని సీఎం చెప్పారు.
హైదరాబాద్ రూపురేఖలు మార్చనున్న ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనం
భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులు హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయని రేవంత్‌రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం భూములిచ్చిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఈ అంశాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని కోరారు. ఈ ప్రాజెక్టుల విషయంలో ఎవరికీ నష్టం, కష్టం రానివ్వబోమని స్పష్టం చేశారు.
ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని సాధించాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. దైవం ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు, సహకారం ఉంటే తెలంగాణ మరిన్ని విజయాలు సాధిస్తుందని, రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.




