స్వాతంత్య్రాన్ని పవిత్ర బాధ్యతగా భావించాలి: పవన్ కల్యాణ్
Independence should be viewed as a sacred responsibility: Pawan Kalyan
స్వాతంత్య్ర సమరయోధులకు హృదయపూర్వక నివాళులు
అమరావతి, ఆగస్టు 15: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక నివాళులు అర్పించారు. తమ ధైర్యం, త్యాగం, దేశభక్తితో దేశానికి స్వేచ్ఛను సాధించిన మహనీయుల సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ సందేశాన్ని విడుదల చేశారు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛను తేలికగా తీసుకోకూడదని, అది జాతీయ ఐక్యత, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడాల్సిన పవిత్ర బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి గడిచిన దశాబ్దాల్లో భారత్ నిశ్శబ్దమైన సంకల్పంతో, అద్భుతమైన ఆశయంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రపంచ అంతరిక్ష శక్తిగా ఎదగడం, చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో చారిత్రాత్మక ల్యాండింగ్ సాధించడం, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల నిర్మాణం, యూపీఐ ద్వారా డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటి విజయాలను ఆయన ప్రస్తావించారు.
అదేవిధంగా దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రపంచ వేదికపై భారత్ ఒక ప్రధాన ఆర్థిక శక్తిగా స్థిరపడటం భారత ప్రజల ప్రతిభ, పట్టుదల, అకుంఠిత స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు.
విభజనతో తీవ్రంగా దెబ్బతిన్న దేశాన్ని వారసత్వంగా స్వీకరించినప్పటికీ ఐక్యత, పునర్నిర్మాణం, ప్రగతి అనే ఉన్నత మార్గాన్ని ఎంచుకున్న మహనీయ రాజనీతిజ్ఞులు, జాతి నిర్మాతలకు పవన్ కల్యాణ్ ప్రగాఢ గౌరవం తెలిపారు.
వారి దార్శనికత, ధైర్యసాహసాల ఫలితంగానే నేడు భారతీయులు గర్వంగా నివసిస్తున్న దేశానికి బలమైన పునాదులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వ పరిరక్షణకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.




