రిటైర్మెంట్ డబ్బుల కోసం భర్తను రోకలిబండతో కొట్టి హత్య
హుస్నాబాద్‌లో దారుణ ఘటన.. భార్యపై కేసు నమోదు
Husband beaten to death with a pestle over retirement money.
హుస్నాబాద్, ఆగస్టు 17 (వాయిస్ టుడే):
రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి విషయంలో జరిగిన గొడవ భర్త హత్యకు దారితీసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్‌నగర్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. హనుమాన్‌నగర్‌కు చెందిన వెంకటేశం ఆసిఫాబాద్‌లో కమర్షియల్ ట్యాక్స్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయన భార్య రాజమణి ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెలలో వెంకటేశం పదవీ విరమణ చేయాల్సి ఉంది.
రిటైర్మెంట్ అనంతరం వచ్చే డబ్బులు, ఆస్తి పంపకాల విషయంలో దంపతుల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. వివాదం తీవ్రరూపం దాల్చడంతో రాజమణి రోకలిబండతో వెంకటేశంపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన వెంకటేశం అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.
భార్య రాజమణిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది.




