గీత, చేనేత కార్మికులకు సంతృప్త స్థాయిలో పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి
Pensions for toddy tappers and handloom weavers on a saturation basis: CM Revanth Reddy

హైదరాబాద్, ఆగస్టు 17 (వాయిస్ టుడే): రాష్ట్రంలోని అర్హులైన గీత, చేనేత కార్మికులందరికీ సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించి, అనంతరం ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. గౌడ కార్మికులకు ఇప్పటికే 50 వేల కాటమయ్య కిట్లు పంపిణీ చేశామని, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నామని చెప్పారు.
గీత కార్మికుల ఉపాధికి ఊతమిచ్చేలా నీటిపారుదల ప్రాజెక్టుల కాలువల గట్లపై ఈత, తాటి చెట్లు నాటేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక కులానికో, కుటుంబానికో పరిమితమైన నాయకుడు కాదని, బహుజనుల నుంచి ఎదిగిన వీరుడని సీఎం పేర్కొన్నారు. గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన పాపన్న పోరాట స్ఫూర్తి తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
అదేవిధంగా అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
కులవృత్తులను గౌరవిస్తూ కొనసాగించాలని, అయితే పిల్లలకు నాణ్యమైన విద్య అందించి ఉన్నతస్థానాలకు తీసుకెళ్లాలని సీఎం పిలుపునిచ్చారు. విద్యార్థుల విద్య, వసతి, భోజనం కోసం ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయిస్తుందని తెలిపారు.
బీసీ కులగణన, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ద్వారా సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.




