ఘనంగా ‘సర్దార్ సర్వాయి పాపన్న’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ నెల 21న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
Grand Pre-release Event for the Movie ‘Sardar Sarvai Papanna’

హైదరాబాద్, ఆగస్టు 18:
బహుజన చక్రవర్తిగా కీర్తి పొందిన చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ చిత్రం ‘సర్దార్ సర్వాయి పాపన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. వి.జి. మూవీ మేకర్స్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
పలువురు సినీ, రాజకీయ, సామాజిక ప్రముఖుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిత్ర బృందం, గౌడ సంఘాల ప్రతినిధులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని చిత్రానికి శుభాకాంక్షలు తెలిపారు.
పేదల కోసం పోరాడిన వీరుడు సర్దార్ పాపన్న: డా. ప్రతాని రామకృష్ణ గౌడ్
డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని ఈ నెల 21న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నామని తెలిపారు. పన్నుల దోపిడీ నుంచి పేద ప్రజలను కాపాడేందుకు సర్దార్ పాపన్న పోరాడారని, బడుగు, వెనుకబడిన వర్గాలను ఏకం చేసి పోరాటం సాగించారని అన్నారు.
సర్దార్ పాపన్న సుమారు 30 కోటలను జయించి, గోల్కొండ కోటపై కూడా తిరుగుబాటు చేశారని పేర్కొన్నారు. అలాంటి వీరుడి చరిత్రను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
తాను సుమారు 25 ఏళ్ల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్నపై సినిమా రూపొందించానని, అప్పటితో పోలిస్తే ప్రస్తుతం పాపన్న చరిత్రపై ప్రజల్లో అవగాహన గణనీయంగా పెరిగిందన్నారు. నేడు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో సర్దార్ పాపన్న విగ్రహాలు ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. ఈ చారిత్రక నేపథ్యంతో సినిమా రూపొందించిన వెంకటేష్ గౌడ్‌ను అభినందించారు.
భారీ సినిమాటిక్ అనుభూతిని అందిస్తాం: వెంకటేష్ గౌడ్
దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా ఈ ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పాపన్న గౌడ్ చరిత్రకు సంబంధించిన అనేక గ్రంథాలను అధ్యయనం చేసి, వివిధ అంశాల నుంచి సమాచారాన్ని సేకరించి ఈ సినిమాను రూపొందించినట్లు చెప్పారు. పరిమిత వనరులతో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సినిమాను తెరకెక్కించామని తెలిపారు.
‘బాహుబలి’ తరహాలో భారీ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేలా చిత్రాన్ని రూపొందించేందుకు ప్రయత్నించామని, ప్రేక్షకులు సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని కోరారు.
AI సాంకేతికతతో పాపన్న చరిత్రకు కొత్త రూపం: డా. కొండా దేవయ్య పటేల్
బీసీ సాధికార సంఘం అధ్యక్షులు డా. కొండా దేవయ్య పటేల్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను నేటి తరానికి పరిచయం చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు.
సర్దార్ పాపన్న పోరాట స్ఫూర్తి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషిని ప్రజలకు చేరువ చేయడంలో ఈ సినిమా కీలకంగా నిలుస్తుందని అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వినియోగిస్తూ దర్శకుడు వెంకటేష్ గౌడ్ లింగంపల్లి సినిమాను ఎంతో చక్కగా తెరకెక్కించారని ప్రశంసించారు. చారిత్రక నేపథ్యాన్ని ఆధునిక సాంకేతికతతో మేళవించి ప్రేక్షకులకు మంచి విజువల్ అనుభూతిని అందించేలా చిత్రాన్ని రూపొందించారని తెలిపారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను ప్రతి బహుజనుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా యువత ఆయన పోరాట స్ఫూర్తిని తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ నెల 21న విడుదల కానున్న సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
సినిమా సన్నివేశాలు ఆకట్టుకున్నాయి: పాయల్ ముఖర్జీ
హీరోయిన్ పాయల్ ముఖర్జీ మాట్లాడుతూ.. ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ప్రదర్శించిన సినిమా సన్నివేశాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు. సినిమా కూడా ప్రేక్షకులందరికీ నచ్చేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్రానికి మంచి విజయం లభించాలని కోరుకున్నారు.
పాపన్న చరిత్రతో తెరకెక్కిన సినిమా విజయం సాధిస్తుంది: ఏపూరి సోమన్న
గాయకుడు ఏపూరి సోమన్న మాట్లాడుతూ.. కోట్లాది మంది బహుజనులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. సబ్బండ కులాలను ఏకం చేసి గెరిల్లా పోరాటంతో జైత్రయాత్ర సాగించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు.
ఆయన చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమా తప్పకుండా విజయవంతమవుతుందని ఆకాంక్షించారు.
చరిత్రను సమగ్రంగా ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు: పొన్న రవిచంద్ర
ప్రముఖ రచయిత, పాత్రికేయుడు పొన్న రవిచంద్ర మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను గతంలో చాలా మంది వక్రీకరించారని అన్నారు.
అయితే దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ చారిత్రక ఆధారాలను సమగ్రంగా అధ్యయనం చేసి పాపన్న చరిత్రను ప్రజల ముందుకు తీసుకువస్తున్నారని ప్రశంసించారు. ఈ ప్రయత్నం చేసిన దర్శక నిర్మాతను, చిత్రాన్ని విడుదల చేస్తున్న డా. ప్రతాని రామకృష్ణ గౌడ్‌ను అభినందించారు.
పాపన్నకు ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు సంతోషకరం: మధు యాస్కి గౌడ్
మాజీ ఎంపీ మధు యాస్కి గౌడ్ మాట్లాడుతూ.. సమసమాజ స్థాపన కోసం కృషి చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు. ఆయన 376వ జయంతి సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. లక్షలాది మంది ప్రజల ఆకాంక్ష నెరవేరుతున్న రోజుగా దీనిని అభివర్ణించారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్లను అభినందించారు.
తెలంగాణ తొలి శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న సమయంలో స్వామి గౌడ్ గ్రామగ్రామాన పర్యటిస్తూ సర్దార్ పాపన్న విగ్రహాల ఏర్పాటుకు కృషి చేశారని గుర్తుచేశారు. పాపన్న చరిత్రను కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన వెంకటేష్ గౌడ్‌ను అభినందించారు.
ప్రతి ఒక్కరూ థియేటర్లలో సినిమా చూడాలి: స్వామి గౌడ్
తెలంగాణ శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.
పార్టీలకు అతీతంగా ఎంతోమంది పాపన్న విగ్రహం ఏర్పాటు కోసం కృషి చేశారని తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న సినిమాను అద్భుతంగా రూపొందించారని దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్‌ను ప్రశంసించారు.
ఈ నెల 21న విడుదల కానున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ థియేటర్లలో చూడాలని కోరారు. చిత్ర నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీసీ సాధికార సంఘం అధ్యక్షులు డా. కొండా దేవయ్య పటేల్, గాయకుడు ఏపూరి సోమన్న, దిల్‌సుఖ్‌నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ గౌడ్, సర్దార్ పాపన్న వారసుడు రాజన్న, గౌడ సంఘాల నాయకులు గట్టు రామచంద్రరావు, హీరోయిన్ పాయల్ ముఖర్జీ, డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ, డైరెక్టర్, రైటర్ దీపక్ న్యాతి తదితరులు పాల్గొన్నారు.
‘సర్దార్ సర్వాయి పాపన్న’ చిత్రం ఈ నెల 21న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది.




