రైతుల అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పరిశోధనలు జరగాలి: మంత్రి తుమ్మల

- Advertisement -

రైతుల అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పరిశోధనలు జరగాలి: మంత్రి తుమ్మల

Horticultural research must align with farmers’ needs: Minister Tummala

హైదరాబాద్, ఆగస్టు 18 (వాయిస్ టుడే): రైతుల అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పరిశోధనలు చేపట్టి, వాటి ఫలితాలు నేరుగా రైతులకు చేరేలా ఆధునిక సాంకేతికతను వినియోగించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన కళాశాల ప్రాంగణంలో హార్టికల్చరల్ రీసెర్చ్ కాంప్లెక్స్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యాన రంగంలో జరుగుతున్న పరిశోధనలను ప్రయోగశాలలకే పరిమితం చేయకుండా రైతుల పొలాల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి మాధ్యమాలను వినియోగించి పరిశోధన ఫలితాలను వీడియోలు, షార్ట్‌ఫిల్మ్‌ల రూపంలో రైతులకు చేరవేయాలని అన్నారు.

రాష్ట్ర వ్యవసాయ భూమిలో ఉద్యాన పంటలు సుమారు 6 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, వ్యవసాయ స్థూల విలువలో వాటి వాటా 26 శాతం, సుమారు రూ.30,346 కోట్లు ఉందని మంత్రి తెలిపారు. కూరగాయల ఉత్పత్తిలో రాష్ట్రంలో సుమారు 70 శాతం లోటు ఉందని, ఈ లోటును అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ అవసరమన్నారు.

చిన్న, సన్నకారు రైతులే లక్ష్యంగా తక్కువ పెట్టుబడితో, చిన్న కమతాల్లో అమలు చేయగల ఆధునిక సాగు పద్ధతులు, యంత్రాలు, సాంకేతికతపై పరిశోధనలు జరగాలని సూచించారు.

తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగును రానున్న మూడు నాలుగేళ్లలో 10 లక్షల ఎకరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తుమ్మల తెలిపారు. ఆయిల్‌పామ్‌తో పాటు కోకో, జాపత్రి వంటి అంతర పంటల ద్వారా రైతులకు అదనపు ఆదాయం కల్పించే అవకాశాలను పరిశోధించాలని అన్నారు.

కూరగాయలు, పూలు, ద్రాక్ష, ఔషధ, సుగంధ పంటలతో పాటు పంట అనంతర నష్టాలను తగ్గించే సాంకేతికతపై కూడా పరిశోధనలు అవసరమని మంత్రి పేర్కొన్నారు. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సాగు విధానాలను విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు.

యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు హైదరాబాద్‌కే పరిమితం కాకుండా జిల్లాల్లోనూ పరిశోధన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, సాగు ఖర్చులను తగ్గించడం కేంద్రంగా పరిశోధనలు, విధానాలు రూపొందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular