మున్నూరు కాపు కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించాలి
33 జిల్లా కేంద్రాల్లో రెండెకరాల చొప్పున భూమి ఇవ్వాలి: కొండ దేవయ్య పటేల్
Rs. 1,000 crore should be allocated to the Munnuru Kapu Corporation.
బషీర్‌బాగ్, సెప్టెంబర్ 16 (వాయిస్ టుడే): మున్నూరు కాపు కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించడంతోపాటు రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో సంఘ భవనాల నిర్మాణానికి రెండెకరాల చొప్పున భూమి కేటాయించాలని తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ డిమాండ్ చేశారు.
మున్నూరు కాపు విద్యార్థుల వసతి గృహాల నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయాలని, మున్నూరు కాపు సంఘానికి రెండు ఎమ్మెల్సీ పదవులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్రవ్యాప్తంగా మున్నూరు కాపు కుటుంబాల సభ్యత్వ నమోదు కోసం రూపొందించిన వెబ్‌సైట్‌ను కొండ దేవయ్య పటేల్ ఆవిష్కరించారు. అనంతరం సంఘం గ్రేటర్ అధ్యక్షుడు ఆర్.వి. మహేందర్, రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. రాజ్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలోని మున్నూరు కాపు కుటుంబాలన్నీ సంఘం రూపొందించిన వెబ్‌సైట్ ద్వారా సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపుల జనాభా, కుటుంబాల వివరాలను సమగ్రంగా నమోదు చేయడం ద్వారా సంఘాన్ని మరింత బలోపేతం చేసి, హక్కుల సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ప్రతి కుటుంబం సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.
మున్నూరు కాపు విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో వసతి గృహాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యా, వసతి సౌకర్యాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. సంఘం ప్రతిపాదించిన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. సత్యనారాయణ, గ్రేటర్ యూత్ ప్రెసిడెంట్ విశాల్, నాయకులు చింతపండు భూమన్న, రాజేందర్, నందకిషోర్, నిరంజన్, దామోదర్, శ్రవణ్, సందీప్, దుర్గాప్రసాద్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.




