అప్పన్న హస్తం కోసం ఎదురుచూపు
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు గాజుల నాగరాజు
కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయం..
చికిత్సకు సాయం కోసం ఎదురుచూపు
Waiting for Appanna’s helping hand
జగిత్యాల సెప్టెంబర్ 30:
బలహీన వర్గాల నాయకుడిగా, పాత్రికేయుడిగా సమాజంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గాజుల నాగరాజు ప్రస్తుతం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. పది రోజుల క్రితం జగిత్యాలలో జరిగిన
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ప్రస్తుతం కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. గత కొంతకాలంగా ఆర్థిక
ఇబ్బందులతో సతమతమవుతున్న నాగరాజు కుటుంబానికి ప్రమాదం మరింత భారంగా మారింది. భార్య, ఇద్దరు కుమార్తెలతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆయన.. అనుకోని ప్రమాదంతో ఆసుపత్రి
పాలవడంతో వైద్య ఖర్చులు భరించడం కుటుంబ సభ్యులకు భారంగా మారాయి. దీంతో చికిత్స కొనసాగించేందుకు దాతలు, బీసీ సంఘాల నాయకులు, జర్నలిస్టు సంఘాలు, ప్రజాప్రతినిధులు ఆర్థికంగా
అండగా నిలవాలని కుటుంబ సభ్యులు ఆశిస్తున్నారు. నాగరాజు గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బలహీన వర్గాల నాయకుడిగా, పూర్వ విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. అనంతరం పాత్రికేయ రంగంలోకి
ప్రవేశించి ఓ దినపత్రికలో జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. బలహీన వర్గాల సమస్యలపై స్పందిస్తూ, పలువురు యువతను సామాజిక, రాజకీయ రంగాల వైపు ప్రోత్సహించడంతో పాటు ఔత్సాహికులను
జర్నలిజం వైపు తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న నాగరాజు ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతున్న పరిస్థితి కుటుంబ
సభ్యులను కలచివేస్తోంది. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు అయ్యే ఖర్చులను భరించే స్థోమత లేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. నాగరాజు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మానవతా
దృక్పథంతో దాతలు, జర్నలిస్టు సంఘాలు, బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు ఫోన్ పే +919848979742 ద్వారా తోచినంత ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు
విజ్ఞప్తి చేస్తున్నారు.




