- Advertisement -
మారుతోన్న డెస్టినేషన్
A changing destination
హైదరాబాద్, జనవరి 8, (వాయిస్ టుడే)
హైదరాబాద్ లో నిర్మించిన అత్యాధునిక చర్లపల్లి రైల్వే టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ఈ టెర్మనల్ ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ మీద ఉన్న ప్రయాణీకుల ఒత్తిడి తగ్గనుంది. పెరుగుతున్న ట్రాఫిక్ ను తగ్గించడంతో పాటు ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి అనుగుణంగా నగర శివార్లలో చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. రూ. 428 కోట్ల వ్యయంతో విమానాశ్రయాన్ని తలపించేలా ఈ రైల్వే టెర్మినల్ ను తీర్చిదిద్దారు.చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద సుమారు 50 వేల మంది ప్రయాణీకు భారం తగ్గనుంది. వారి ప్రయాణ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చర్లపల్లి నుంచి 12 జతల రైళ్లు నడుస్తున్నాయి. కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మరో 13జతల రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 50 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు కొనసాగించనున్నాయి. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, వైజాగ్ కు వెళ్లే రైళ్లు ఇప్పుడు చర్లపల్లి నుంచి నపడనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ లో గణనీయంగా రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది.ప్రస్తుతం చర్లపల్లి నుంచి 6 ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఆ రైళ్లలో గోరఖ్ పూర్-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్- హైదరాబాద్ ఎక్స్ ప్రెస్, షాలిమార్ – హైదరాబాద్ ఈస్ట్ కోస్టు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలను కొనసాగించగా, ఇకపై చర్లపల్లి నుంచి ప్రయాణాలను కొనసాగించనున్నాయి. త్వరలోనే మరిన్ని రైళ్లు అందుబాటులోకి రానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.చర్లపల్లి రైల్వేస్టేషన్ లో మూడు రైళ్లకు హాల్టింగ్ అవకాశాన్ని కల్పించారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరే మూడు రైళ్లు చర్లపల్లిలో కాసేపు ఆగనున్నాయి. జనవరి 7 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి 8.32కి చర్లపల్లికి చేరుకుని ఒక నిమిషం ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ చర్లపల్లికి రాత్రి 7.02 గంటలకు చేరుకుంటుంది. ఇక గుంటూరు-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ చర్లపల్లిలో మధ్యాహ్నం 12.41కి, సికింద్రాబాద్-గుంటూరు ఎక్స్ ప్రెస్ మధ్యాహ్నం 12.50కి చర్లపల్లిలో ఆగుతాయి. అటు సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ సాయంత్రం 3.47కి, సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ ఉదయం 9.20కి చర్లపల్లిలో ఆగనున్నాయి. ఇక, సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 52 అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వీటిలో కొన్ని రైళ్లకు చర్లపల్లి స్టేషన్ లోనూ స్టాపింగ్ కల్పించారు. ఆయా ప్రాంతాలకు 18వ తేదీ వరకు ఈ ట్రైన్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
- Advertisement -