రోజు కూలీగా మొగలయ్య
హైదరాబాద్, మే 4, (వాయిస్ టుడే)
పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారు. తుర్కయాంజల్‌లో ఓ ఇంటి వద్ద పని చేస్తున్న ఆయన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనకు ఆరు వందల గజాల ఇంటి స్థలంతో పాటు రూ. కోటి సాయం చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా రూ. కోటి చెక్కును అందించారు. అయితే అవి తన పిల్లల పెళ్లిళ్లతో పాటు స్థలం కొనుక్కోవడానికి సరిపోయాయనని .. డబ్బులు సరిపోకపోవడంతో కడుతున్న ఇంటిని కూడా మధ్యలో నిలిపివేశానని ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులకు చెప్పారు. తన కుమారులకు అనారోగ్యం ఉందని అలాగే తనకు కూడా అనారోగ్యం ఉందని.. నెలకు మెడిసిన్స్ ఖర్చు రూ. ఏడు వేలు అవుతోందన్నారు. ప్రభుత్వం ఆయనకు ఆర్థిక సాయం ప్రకటించిన సమయంలోనే నెలకు రూ. పదివేల ప్రత్యేక పెన్షన్ మంజూరు చేసింది. ఆ పెన్షన్ సరిగా అందడం లేదని ఆయన చెబుతున్నారు. గత రెండు, మూడు నెలల నుంచి పెన్షన్ రావడం లేదని చెప్పారు. దర్శనం మొగులయ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నలు వచ్చాయి. మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం కవులు, కళాకారులను ఎప్పుడూ గౌరవిస్తుంది. వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించి అత్యున్నతంగా గౌరవిస్తుందని ప్రకటించింది. గుస్సాడి కనకరాజు, దర్శన్ మొగిలయ్య తదితరులకు క్రమం తప్పకుండా పెన్షన్ చెల్లించిందని ఆధారాలను పోస్టు చేసింది. కొంత మంది గత ప్రభుత్వమే మొగులయ్యకు రూ.కోటి ఇస్తే ఇప్పుడు ఇలా కూలి పని చేస్తున్నట్లుగా మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారని.. రాజకీయ ఆయుధంగా మారుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు రోజుల కిందటే మొగులయ్య సీఎం రేవంత్ ను క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఆ ఫోటోలను కూడా మీడియాకు విడుదల చేశారు. తెలంగాణకు ప్రసిద్ధమైన కిన్నెర కళాకారుడిగా మొగులయ్యకు ప్రత్యేక గుర్తింపు ఉంది. భీమ్లా నాయక్ సినిమాలో ఆయనతో పాట కూడా పాడించారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా రూ. రెండు లక్షలు సాయం చేశారు. అలాగే పలువురు ఇతరులు కూడా ఆయనకు సాయం చేశారు.
రోజు కూలీగా కిన్నెర కళాకారుడి మొగలయ్య
- Advertisement -
- Advertisement -