- Advertisement -
దివిసీమకు తప్పిన ముప్పు
A missed threat to Diviseemaసహాయక, పురరావాస చర్యలు భేష్
మండలి బుద్ద ప్రసాద్
అవనిగడ్డ
కృష్ణానదికి చరిత్రలో ఎరుగని స్థాయిలో వచ్చిన వరద ముప్పును కూటమి నాయకులు, అధికారులు సమర్ధవంతంగా ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం రాత్రి అవనిగడ్డ గాంధీక్షేత్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల వరదల్లో ఎలాంటి ప్రాణనష్టం కలుగకుండా శ్రమించిన కూటమి నాయకులను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, యువనాయకులు మండలి వెంకట్రామ్ ప్రశంసించి ప్రశంసాపత్రాలు బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో బలహీనపడిన కరకట్టను కాపాడుకునేందుకు అనునిత్యం శ్రమించిన ప్రతి ఒక్కరూ అభినందనీయులు అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దమని కూటమి నాయకులు నిరూపించారన్నారు. వరదల సమయంలో ఐదు లంక గ్రామాల ప్రజలను అప్రమత్త పరిచి వరద తీవ్రత వివరించటంతో పాటు, వరద ముంపు చుట్టుముట్టిన సమయంలో సహాయక చర్యలు, పునరావాస చర్యలు చేపట్టడంతో దివిసీమకు పెనుముప్పు తప్పిందన్నారు. వరదలో సహాయక చర్యలు, పునరావాస చర్యలు కూటమి నాయకులు, అధికారులు విజయవంతం చేశారని, ఇక ముంపు ప్రాంతాల పునర్నిర్మాణంపై దృష్టి పెడతానని ప్రకటించారు. ఎదురుమొండి దీవుల్లో పూర్తిగా కోతకు గురైన కరకట్ట రోడ్డు నిర్మాణం, ఎడ్లంక దీవి పరిరక్షణపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఔట్ ఫాల్ స్లూయీజులు, పులిగడ్డ ఆక్విడెక్ట్ అభివృద్ధి చేస్తామని, ఈ పనులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంపూర్ణ సహకారం అందిస్తారనే విశ్వాసం ఉందన్నారు. ముంపు గ్రామాల్లో పక్కా గృహాలు, నూరు శాతం సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వరద ముంపు గృహలకు, పొలాలకు ఉపశమనం కలిగించే సహాయ ప్యాకేజి ప్రకటించిందన్నారు.
నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ వరద సహాయక చర్యల్లో తన అనుభవాలు వివరించారు. కూటమి నాయకులు, అధికారులు, కరకట్ట వెంబడి గ్రామాల ప్రజల సంపూర్ణ సహకారంతో పెను విపత్తును ఎదుర్కొన్నామని, వరద ముంపు కరకట్ట అంచుకు తాకిన సమయంలో వర్షాలు కురియకుండా భగవంతుడు సహకరించటంతో తమ అందరి ప్రయత్నం, శ్రమ ఫలించాయన్నారు. వరద ముప్పు ఎదుర్కొనే క్రమంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ మండలి వెంకట్రామ్ కృతజ్ఞతలు తెలిపారు.
కూటమి నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అమెరికాలో ఉన్నప్పటికీ ఆయన మార్గదర్శకాలు పాటిస్తూ నిద్రహారాలు మాని వరద ముప్పు తొలగేవరకూ మండలి వెంకట్రామ్ శ్రమించిన తీరు మండలి కుటుంబ నాయకత్వ పటిమకు, వెంకట్రామ్ నాయకత్వ సమర్ధతకు ప్రత్యక్ష నిదర్శనంలా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ కో కన్వీనర్ తుంగల వెంకట గిరి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు పరుచూరి సుభాష్ చంద్రబోస్, టీడీపీ నాగాయలంక, మోపిదేవి మండలాల అధ్యక్షులు మెండు లక్ష్మణరావు, నడకుదుటి జనార్దనరావు, జనసేన పార్టీ అవనిగడ్డ, కోడూరు, మోపిదేవి మండలాల అధ్యక్షులు గుడివాక శేషుబాబు, మర్రె గంగయ్య, పూషడపు రత్నగోపాల్, బీజేపీ మోపిదేవి మండల అధ్యక్షుడు సనకా ప్రశాంత్, సర్పంచులు పైడిపాముల కృష్ణకుమారి, దొప్పలపూడి గంగాభవానీ, కొక్కిలిగడ్డ మాధవి, దిడ్ల జానకీ రాంబాబు, పోలిమెట్ల ఏసుబాబు, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత, ఎంపీటీసీలు లంకే భాస్కరరావు, బొప్పన భాను, మండల కో ఆప్షన్ చందన రంగారావు, గుడివాక శివరావు, నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -




