8.3 C
New York
Friday, April 19, 2024

చేరికలు.. కాంగ్రెస్ కు బలమా… బలహీనమా…

- Advertisement -

చేరికలు..
కాంగ్రెస్ కు బలమా… బలహీనమా…
హైదరాబాద్, ఏప్రిల్ 1 (వాయిస్ టుడే )
తెలంగాణలో ఇప్పుడంతా రివర్స్ రాజకీయం నడుస్తోంది. భూమి గుండ్రంగా ఉందన్నట్లుగా గతంలోకేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని, నేతల్ని ఎలా పార్టీలో చేర్చుకున్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతల్ని అలా చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకున్నారు కేసీఆర్. సాధ్యం కాలేదు. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని రెండు సార్లు శాసనసభాపక్షాల్ని విలీనం చేసుకున్నారు. అయినా కాంగ్రెస్ బేషుగ్గా ఉంది. ఇప్పుడు అధికారంలోకి కూడా వచ్చింది. అంటే కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పని తేలిపోయింది. అయినా కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ అదే తప్పు ఎందుకు చేస్తోంది. కొత్తగా చేరే వాళ్లతో ఆ పార్టీకి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ బీఆర్‌ఎస్‌ ఎంత ఉన్నత స్థితిని చూసిందో ఇప్పుడు అంతటి హీన స్థితిని ఎదుర్కొంటోంది. అధికారం రాగానే వచ్చిన నేతలంతా అధికారం పోగానే మళ్లీ అధికార పార్టీ వైపు వెళ్తున్నారు. సిట్టింగ్‌ ఎంపీల నుంచి మొదలుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యులు తమను తాము రక్షించుకునేందుకు పార్టీలు మారుతున్నారు. పెద్దపల్లి ఎంపీ సీటును కొప్పుల ఈశ్వర్‌కు ప్రకటిస్తారని తెలియగానే బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ వెంకటేష్‌ నేత పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌ పంచన చేరారు. చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చినా…గులాబీ బాస్‌ చెప్పినా.. రాత్రికి రాత్రే హస్తం గూటికి చేరి అదే పార్టీ నుంచి టికెట్‌ సంపాదించుకున్నారు. జహీరాబాద్‌, నాగర్‌ కర్నూల్‌ బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీలు బిబి.పాటిల్‌, రాములు బీజేపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ నుంచి మళ్లీ బరిలో నిలిచారు. అయితే రాములు మాత్రం తన కొడుకును లైన్లో పెట్టారు. ఇక హైదరాబాద్‌ శివారులో గట్టి పట్టున్న పట్నం మహేందర్‌ రెడ్డి చివరి క్షణంలో కాంగ్రెస్‌ గూటికి చేరి తన భార్య సునితారెడ్డికి మల్కాజిగిరి టికెట్‌ దక్కించుకున్నారు. ఇక దానం నాగేందర్‌ ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా గులాబీ పార్టీ నుంచి గెలిచినా కాంగ్రెస్‌ కండువా కప్పుకుని సికింద్రాబాద్‌ ఎంపీ ఆభ్యర్థిగా బరిలో నిలిచారు. హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, ఆరూరి రమేష్‌, లాంటి నేతలు పార్టీలు మారారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అతని కూతురు వరంగల్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ టికెట్‌ దక్కించుకున్న కడియం కావ్య, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, అతని కూతురు హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి లాంటి ముఖ్యులూ పార్టీ మారేందుకు సిద్దమయ్యారు. వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్‌ చైర్మెన్ల వరకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పార్టీని వీడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ కమ్ సీఎంగా డబుల్ రోల్ పోషిస్తున్న రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ స్థీరీకరణ అనే కాన్సెప్ట్ ను ఏకకాలంలో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన చేరికల కోసం గేట్లు ఎత్తారు. తాము గేట్లు ఎత్తామని ప్రకటించిన వెంటనే పోలోమంటూ పెద్ద ఎత్తున నేతలు తరలి వస్తున్నారు . కానీ వీరంతా కాంగ్రెస్ పతనం కోసమే వస్తున్నారని చరిత్ర నిరూపిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అండ్ టీం .. ఏటికి ఎదురీది గెలిచారు. ప్రస్తుతం పార్టీలో చేరుతున్న వారంతా కాగ్రెస్ పార్టీని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డిన వాళ్లే. కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని నమ్మిన వాళ్లే. ఇప్పుడు వారు రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తగానే పోలోమంటూ ఎందుకు వస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఇలాంటి నేతలు కూడా కారణం. బీఆర్ఎస్ అధినేత వద్ద ఉన్న అలుసును ఆసరాగా చేసుకుని.. వారు చేసిన వ్యవహారాలతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది. నిజానికి ఇదే అతి పెద్ద సమస్య. ఇప్పుడు గేట్లు ఎత్తి ఈ సమస్యను తన నెత్తి మీద వేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. అంతే కాదు పార్టీ కోసం కష్టపడిన వారు ఉన్నారు. దశాబ్దం పాటు పార్టీ కోసం కష్టపడిన వారు.. అసలు పార్టీకి భవిష్యత్తే ఉండదన్న భావన వచ్చినప్పటికీ పార్టీని వదిలి పెట్టని వారు ఉన్నారు. వారిలో చాలా మంది గ్రామ, మండల స్థాయిలోనే ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ ఎప్పటికప్పుడు బలంగా ఉందన్న భావన రావడానికి లీడర్లు పోయినా క్యాడర్ పోలేదని అనుకోవడమే. అది నిజం కూడా. ఇప్పుడు .. బీఆర్ఎస్ నేతలంతా పోలోమని కాంగ్రెస్ లోకి వస్తే.. మరి వారికి అన్యాయం చేసినట్లే అవుతుంది. అందర్నీ గుర్తిస్తామని రేవంత్ చెబుతున్నారు. కానీ అది మాటల్లో అంత తేలిక కాదు. పాతిక మందికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారని అంటున్నారు. పార్టీలో చేరిన సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఇవ్వడం వల్ల అప్పటికే పార్టీలో ఉన్న నేతల అవకాశాల్ని దెబ్బకొట్టాల్సి వస్తోంది. అలా చేయడం వల్ల పార్టీకే నష్టం జరగనుంది. చేరుతున్న వారు ఎవరూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించలేదు. గ అప్పట్లో అభ్యర్థి ఎవరు అన్నది కాదు.. కారు గుర్తు ఉన్నదా లేదా అన్నది చూసుకుని ఓట్లేశారు జనం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఆ కారు గుర్తు నేతలు ఎప్పుడూ ఆ పార్టీని గెలిపించలేదు. గెలిచి చూపించిన కాంగ్రెస్ పార్టీకి వారు చేసేదేమీ ఉండదు. కానీ.. బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేయవచ్చు. ఈ వ్యూహంతో తమ కుంపటికి నిప్పుపెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే చేస్తుంది. చేరికల ద్వారా నేతల్ని చేర్చుకోవడం ద్వారా ఓ పార్టీ బలపడదు.. ప్రజాభిమానం పెంచుకుంటేన సాధ్యం అని ఇప్పటి వరకూ రాజకీయ ఫలితాలు నిరూపించాయని రాజకీయ వర్గాల అంచనా.
=====================

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!