
హైదరాబాద్, జులై 27: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల ధాటికి విద్యా సంస్థలకు ప్రభుత్వం వరుసగా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
వర్షాల మూలంగా వారం రోజులుగా సెలవులు ప్రకటించడంతో వీటి ప్రభావం పరీక్షల నిర్వహణపై పడుతోంది. వర్షాలు తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పరీక్షలన్నింటినీ వాయిదా వేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు వర్సిటీలు, విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే ఓయూ, జేఎన్టీయూ, తెలుగు యూనివర్సిటీల్లో ఇంటర్నల్ పరీక్షలతోపాటు ఎంట్రన్స్ టెస్ట్‌లు సైతం వాయిదా పడ్డాయి. డిగ్రీ ప్రవేశాల తేదీల్లోనూ మార్పులు చేశారు. దీంతో డిగ్రీ, ఇంజనీరింగ్ పరీక్షలు మరింత ఆలస్యం కానున్నాయి. పాఠశాలల్లో జూలైలో జరగాల్సిన ఫార్మేటివ్ అసెస్‌మెంట్ (ఎఫ్‌ఏ-1) పరీక్షలనూ వాయిదా వేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఇక ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును జులై 25 నుంచి నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ కౌన్సెలింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీని జులై 28 వరకూ పొడిగించారు. ఇక ఎంసెట్ రెండో దశ కౌన్సెలింగ్‌కు ఆప్షన్ల గడువు 27తో ముగియనుండగా ఈ నెల 31న సీట్ల కేటాయింపు ఉంటుందని సాంకేతిక విద్య కమిషనరేట్ తెలిపింది. అప్పటికి వర్షాలు తగ్గకపోతే రెండో విడత చేరికల తేదీని పొడిగించాలని అధికారులు భావిస్తున్నారు.
సోమవారం వరకు సెలవులేనా
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందును తెలంగాణ సర్కారు విద్యా సంస్థలకు బుధవారం, గురువారం రెండు రోజులు సెలవులు ప్రకటించింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ మంగళవారం ఆదేశించారు. దీంతో విద్యాశాఖ స్పందించి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జులై 26, 27 తేదీలను రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెలవు దినాలుగా ప్రకటించింది.ఈ రెండు రోజుల సెలవుల తర్వాత 28వ తేదీన ఆప్షనల్ హాలీడే ఉందని అంటున్నారు. తర్వాత రోజు 29వ తేదీన మొహర్రం పండుగ నాడు అధికారిక సెలవు ఉండనే ఉంది. 30వ తేదీన ఆదివారం రానే వచ్చంది. ఇలా వరుసగా ఐదు రోజులు సెలవులు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది.ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం 28వ తేదీన మొహర్రం పండగ, 29వ తేదీన మొహర్రం జనరల్ హాలీడే ఉన్నాయి. 28వ ఆప్షనల్ హాలీడే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది. 29న సెలవు స్కూళ్లకు వర్తించనుంది. 30న ఎలాగూ ఆదివారం కాబట్టి వరుసగా మొత్తం ఐదు రోజులు సెలవులు వస్తున్నాయి.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా బాగానే వర్షాలు కురిశాయి. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 149.3 మిల్లీ మీటర్ల వర్షం కురవగా.. ఆసిఫ్ నగర్ లో 43.5 మిల్లీ మీటర్లు, ఆ తర్వాత టోలిచౌకీలో 37 మిల్లీ మీటర్లు, అల్వాల్ లో 3.3 మి.మీ, మాదాపూర్ లో 28 మి.మీ, మియాపూర్ లో 27 మి.మీ వర్షం కురిసింది.
రాగల నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
షీయర్ జోన్ 17°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిమీ నుండి 7.6 కిమి ఎత్తువరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది. రాగల మూడు రోజులు భారీ వర్షాలు కొన్ని చోట్ల, భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు తెలంగాణలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాగల 4 రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 40 నుండి 50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆరెంజ్ అలర్ట్ ఈ జిల్లాల్లో
నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు