హైదరాబాద్, అక్టోబరు 27, (వాయిస్ టుడే): తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు అభ్యర్థుల జాబితాలు రిలీజ్ చేస్తూనే..కలిసి వచ్చే వారితో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే.. ఎవరికి వారే యుమునా తీరే అన్నట్టుగా ఉన్న బీజేపీ, జనసేన.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ దగ్గరయ్యాయి. కలిసి పోటీ చేయాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. నిన్న ఢిల్లీ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు. తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటుపై అమిత్ షాతో చర్చించారు. పవన్ కల్యాణ్ వెంట తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి, జనసేన PAC చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఇప్పటికే.. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్.. పవన్ కల్యాణ్‌ను కలిసి తెలంగాణలో బీజేపీకి మద్దతివ్వాలని కోరారు.బీజేపీ-జనసేన పార్టీ కలిసి పోటీ చేయాలని ఓ నిర్ణయానికి రావడంతో సీట్ల సర్దుబాటుపై ఇవాళ హైదరాబాద్‌లో ఇరుపార్టీల నేతలు సమావేశమై చర్చించే అవకాశం ఉంది. ఈ లోపు సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని వారికి అమిత్‌షా సూచించినట్లు తెలుస్తోంది. పార్టీలో చర్చించుకొని ఎవరెక్కడ పోటీ చేయాలనుకుంటున్న దానిపై రేపు అమిత్‌షా భేటీలో పార్టీ నేతలు స్పష్టం చేయనున్నారు.తెలంగాణ ఎన్నికల్లో జనసేన గ్రేటర్ హైదరాబాద్, ఆంధ్రా సరిహద్దు నియోజకవర్గాలపై దృష్టి సారించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రధానంగా కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, ఉమ్మడి మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండజిల్లాలో సీట్లు అడుగుతోంది జనసేన పార్టీ. మొత్తం 32 సీట్లు కావాలని కోరుతోంది. కనీసం 20 సీట్లకు పట్టుబట్టే అవకాశం ఉంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఇరుపార్టీల ప్రాబల్యం ఆధారంగా కొన్ని సీట్లు కేటాయిస్తామని బీజేపీ చెబుతోంది. జనసేన అడుగుతున్న 32 సీట్లలో ఇప్పటికే 10 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. మొత్తానికి జనసేన ఎన్ని సీట్లు అడిగినా..బీజేపీ ఐదారు సీట్లకు మించి వదిలేందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది.తెలంగాణలో జనసేన పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేపట్టనున్నారు. గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాల్లో యాత్ర కొనసాగుతుందని ఆ పార్టీ తెలంగాణ నేతలు తెలిపారు. పార్టీ క్యాడర్ బలంగా ఉన్న 32 నియోజకవర్గాల మీదుగా వారాహి యాత్ర కొనసాగుతుందన్నారు.