Thursday, April 2, 2026

లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం –

- Advertisement -

లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం –
ఇండీ కూటమి పార్టీలు కూడా మద్దతు!
న్యూఢిల్లీ,  ఏప్రిల్ 1, వాయిస్ టుడే

Amaravati Bill Passed in Lok Sabha
లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు-2026కు ఆమోదం లభించింది.  ఆంధ్రప్రదేశ్ ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  ఆంధ్రప్రదేశ్ పునర్విభజన  సవరణ  బిల్లు-2026 కు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చలో వైఎస్ఆర్‌సీపీ మినహా అన్ని పార్టీలు సమర్థించాయి.  పదేళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, 2024 జూన్ 2 నుండి అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తించేలా ఈ బిల్లులో నిబంధనలను చేర్చారు. ఈ బిల్లు ఆమోదంతో అమరావతికి రాజ్యాంగబద్ధమైన గుర్తింపు లభించినట్లయింది.       అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూజువాణీ ఓటు ద్వారా బిల్లుకు ఆమోదం తెలిపారు. అనంతరం ఈ బిల్లు రాజ్యసభకు వెళ్లనుంది.ఈ చర్చలో  ఇండీ   కూటమి అనూహ్యంగా బిల్లుకు మద్దతు ప్రకటించడం విశేషం. కాంగ్రెస్ పార్టీ తరపున మాణికం ఠాగూర్ వంటి నేతలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని ఏర్పాటు ఉండాలని, అమరావతికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కేవలం రాజకీయాల కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రతిపక్ష సభ్యులు పేర్కొన్నారు. దీంతో బిల్లుపై చర్చలో మెజారిటీ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి సానుకూలత వ్యక్తం చేశాయి.  అయితే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్  చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ చర్చకు సమాధానమిస్తూ.. ఏపీ అసెంబ్లీ తీర్మానం మేరకే ఈ సవరణ చేస్తున్నామని, ఇది రాష్ట్ర ప్రగతికి ఊతమిస్తుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు , ఇతర విభజన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. చర్చ అనంతరం స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో మూజువాణి ఓటు ద్వారా ఈ బిల్లును ఆమోదించారు. గురువారం ఈ బిల్లు రాజ్యసభ ముందుకు వెళ్లనుంది.  రాజ్యసభలో ఆమోదం తర్వాత రాష్ట్రపతి కి పంపుతారు . అక్కడ తుది ఆమోదం తరవాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. దాంతో ఏపీ రాజధానిగా అమరావతి శాశ్వతం అవుతుంది.  మళ్లీ మార్చాలంటే..  పార్లమెంట్ లోనే చట్టం చేయాల్సి ఉంటుంది.
పెమ్మసాని భావోద్వేగం
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ భావోద్వేగంగా ప్రసంగించారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల రాజధానిగా అభివర్ణించిన ఆయన, ఒక “అమరావతి బిడ్డగా” ఈ బిల్లుపై మాట్లాడటం తన అదృష్టమని పేర్కొన్నారు. రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాల భూమిని సమీకరించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని, ఆయనపై ప్రజలకున్న నమ్మకమే అమరావతికి పునాది అని కొనియాడారు. అమరావతి కోసం రైతులు, ప్రజలు 1631 రోజులు పోరాడారని పెమ్మసాని గుర్తుచేశారు.గత ప్రభుత్వ హయాంలో రాజధాని రైతులు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొన్న ఇబ్బందులను మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. వికేంద్రీకరణ పేరుతో అప్పటి సీఎం జగన్ మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారని, 29 వేల మంది రైతులకు అన్యాయం చేశారని విమర్శించారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ యాత్ర చేసిన మహిళా రైతులను లాఠీలతో వేధించారని, వారి కన్నీళ్లే నేడు ఈ చట్టానికి పునాదిగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అణిచివేత వల్లే అమరావతి ఉద్యమం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఆయన అన్నారు.రాష్ట్రాభివృద్ధిలో రాజధాని పాత్ర అత్యంత కీలకమని, బెంగళూరు, చెన్నై తరహాలో అమరావతి కూడా ఏపీ ఆర్థిక వ్యవస్థకు ఇంజిన్‌లా మారాలని పెమ్మసాని ఆకాంక్షించారు. రాజధాని మార్పుపై భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ అస్థిరత ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ చట్టసవరణ తెస్తున్నామని స్పష్టం చేశారు. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందా అన్న అనుమానాలకు ఈ బిల్లు ముగింపు పలుకుతుందని చెప్పారు. ఈ చట్టబద్ధతకు సహకరించిన ప్రధాని మోదీకి, కూటమి ఐక్యతకు కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి: పురందేశ్వరి
న్యూఢిల్లీ: ఏపీకి శాశ్వత రాజధానిగా అమరావతి కొనసాగుతుందని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో రాజమండ్రి ఎంపీ పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ సరిగ్గా జరగలేదని, ఆనాడు పార్లమెంట్‌లో లైట్లు, కెమెరాలు ఆపివేసి కనీస చర్చ లేకుండానే బిల్లును పాస్ చేశారని పురంధేశ్వరీ గుర్తుచేశారు. ఆనాటి విభజన బాధ నుంచి, ప్రజల ఆగ్రహం నుంచే ఏపీ రాజధానిగా అమరావతి ఆవిర్భవించిందని చెప్పారు. ఏపీ విభజన అనంతరం రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రంలో పాలన ప్రారంభమైంది. రాజధాని అమరావతి కోసం 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిచ్చారని పురందేశ్వరి గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి భవితవ్యం అంధకారంలో పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన రాజధానికి భూములు త్యాగం చేసిన రైతుల పట్ల గత ప్రభుత్వం అత్యంత అమానుషంగా ప్రవర్తించిందని ఆమె విమర్శించారు. ఈ చట్టసవరణ ద్వారా అమరావతికి శాశ్వత గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు.
వైసీపీ వాకౌట్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి బిల్లును లోక్ సభలో వ్యతిరేకించింది. అమరావతికి వ్యతిరేకం కాదని తాము చర్చలో పాల్గొంటామని మిథున్ రెడ్డి సమావేశం ప్రారంభానికి ముందు మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే సభలో చర్చ ప్రారంభమయ్యే సరికి పూర్తిగా వ్యూహం మారిపోయింది. తాడేపల్లిలో జగన్ మోహన్ రెడ్డి ప్రెస్మీట్ చూసిన తర్వాత మిథున్ రెడ్డి తన వ్యూహం మార్చుకున్నారేమో కానీ..  ప్రస్తుత రూపంలో తాము బిల్లును వ్యతిరేకిస్తున్నామని చెప్పి వాకౌట్ చేస్తున్నట్లుగా ప్రకటించి . .. మిగిలిన ముగ్గురు ఎంపీలతో కలిసి బయటకు వెళ్లిపోయారు.     ప్రసంగంలో మిథున్ రెడ్డి బిల్లును వ్యతిరేకిస్తూనే తమ పార్టీ అమరావతికి వ్యతిరేకం కాదని, కానీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధిని ఆకాంక్షిస్తుందని స్పష్టం చేశారు. కేవలం ఒకే ప్రాంతానికి రూ. 15 వేల కోట్లు కేటాయించడం వల్ల మిగిలిన వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలు నిర్లక్ష్యానికి గురవుతాయన్నారు.   కేంద్రం ఇచ్చే ఈ నిధులు గ్రాంటుగా ఉండాలని, అప్పుల రూపంలో ఇస్తే రాష్ట్రం మరింత ఆర్థిక సంక్షోభంలో పడుతుందన్నారు. రాజధాని నిర్ణయం అన్నది రాష్ట్ర నిర్ణయం అని గతంలో కేంద్రం హైకోర్టులో అఫిడవిట్ వేసిందన్నారు. అమరావతి రైతులకు ప్లాట్లు ఎప్పుడిస్తారో బిల్లులో పెట్టాలన్నారు. ఇప్పటికే యాభై వేల ఎకరాలున్నాయని..మరో యాభై వేల ఎకరాలెందుకని మితున్ రెడ్డి ప్రశ్నించారు.    విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయడం లేదన్నారు.  ఏడు వెనుకబడిన జిల్లాలకు ఇస్తామన్న బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీని వెంటనే విడుదల చేయాలని కోరారు.  రాజధాని కోసం తీసుకున్న రుణాలు భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలపై భారంగా మారుతాయని, ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. అలాగే, పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను విడుదల చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని విస్మరించకూడదని ఆయన ప్రసంగంలో  చెప్పారు.
వికేంద్రీకరణ ఆలోచనను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని వైసీపీ వాకౌట్
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల చూపిస్తున్న వివక్షకు నిరసనగా వైఎస్సార్‌సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం ఒకే నగరానికి ప్రాధాన్యత ఇస్తూ, రాష్ట్రం మొత్తం సమతుల్యంగా ఎదగాలన్న వికేంద్రీకరణ ఆలోచనను కేంద్రం పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.   రాష్ట్ర ప్రయోజనాల కోసం, వెనుకబడిన ప్రాంతాల హక్కుల కోసం తమ పోరాటం పార్లమెంటు లోపల , వెలుపల కొనసాగుతుందని చెప్పారు.
లోకేశ్ ఫుల్ హ్యాపీ
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రక ఘట్టం పార్లమెంటులో ఆవిష్కృతమవుతున్న వేళ, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆ క్షణాలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆయన చప్పట్లు కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, సభలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ పురందేశ్వరి అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్న దృశ్యాలను తన ఫోన్‌లో వీడియో తీశారు.‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని’ నినాదంతో, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గతంలో చేసిన ఏకగ్రీవ తీర్మానానికి అనుగుణంగా, అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును నేడు లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది.ఈ చారిత్రక సందర్భంపై లోకేశ్ స్పందిస్తూ, ఇది ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే రోజని అభివర్ణించారు. “నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి” అని ప్రతి ఒక్కరూ చెప్పుకునే రోజు ఇదని అన్నారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షల విజయమని, రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులని, శాంతియుత పోరాటానికి లభించిన ఫలితమని పేర్కొన్నారు.అమరావతి బిల్లుకు మద్దతుగా నిలిచిన కేంద్ర ప్రభుత్వానికి, ఇతర పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా అమరావతి నిలిచిందని పేర్కొంటూ, “జై ఆంధ్రప్రదేశ్.. జయహో అమరావతి” అని నినదించారు.”అమరావతి చట్టబద్దత బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చ మొత్తం టీవీలో చూశాను. ఉత్కంఠ రేపింది. అమ‌రావ‌తి చ‌రిత్ర‌-సంస్కృతి, ఆవ‌శ్య‌క‌త స‌భ్యులు వివ‌రిస్తుంటే  ఒక ఆంధ్రుడిగా రోమాలు నిక్క‌బొడుచుకున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం, దేశంలోని వివిధ పార్టీలు నిల‌వ‌డం ఐదుకోట్ల ఆంధ్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌కు అద్దం ప‌ట్టింది. లోక్ స‌భ వేదిక‌గా అమ‌రావ‌తి గొప్ప‌త‌నం దేశ‌మంత‌టికీ మ‌రోసారి ప‌రిచ‌య‌మైంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌జాస్వామ్య దేవాల‌యం పార్ల‌మెంటులో చ‌రిత్ర సృష్టించిన అమ‌రావ‌తి చ‌ట్ట‌బ‌ద్ధ‌త బిల్లు చ‌ర్చ‌లో పాల్గొన‌కుండా వైసీపీ స‌భ్యులు వాకౌట్ చేయ‌డం వారి ద్రోహ‌బుద్ధికి నిద‌ర్శ‌నం. జ‌గ‌న్ ఎన్ని జ‌న్మ‌లెత్తినా అమ‌రావ‌తిలో ఒక్క ఇటుక‌నూ తాక‌లేడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధినీ ఆప‌లేడు. నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాశ్వ‌తం, నా రాజ‌ధాని అమ‌రావ‌తి అజ‌రామ‌రం” అంటూ లోకేశ్ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.
=============

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్