ఏపీ జగన్ ఓటమి ఖాయం – ప్రశాంత్ కిశోర్
రానున్న ఎన్నికల్లో ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ఓటమి ఖాయమని ఎన్నికల వ్యూహకరత్త ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. అప్పులు చేసి సంక్షేమాన్ని అందిస్తున్న జగన్… రాష్ట్రాభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ లాగే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బదులు నియోజకవర్గాలకు ‘ప్రొవైడర్’ మోడ్ లోనే జగన్ ఉండిపోయారు. ఒకప్పటి చక్రవర్తుల మాదిరిగా తాయిలాలతోనే సరిపెట్టడం తప్పితే ఇంకా ఏం లేదు. ప్రజలకు నగదు బదిలీ చేశారు. కానీ ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్రాభివృద్ధిని మరింత ఊతమిచ్చేందుకు ఏమీ చేయలేదు‘’ అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు నెట్టిట వైరల్ గా మారుతున్నాయి.
ఇక జాతీయ స్థాయిలో బీజేపీ విజయావకాశాలపై ప్రశాంత్ కిశోర్ మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్ కలిపి మొత్తంగా 204 లోక్‌సభ స్థానాలుంటే 2014 లేదా 2019లో బీజేపీ ఇక్కడ 50 సీట్లకు మించి సాధించలేదని గుర్తుచేశారు. 2014లో 29 చోట్ల, 2019లో 47 స్థానాల్లో కాషాయ పార్టీ గెలుపొందిందన్నారు. కొద్ది రోజుల క్రితం ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ అనే జాతీయ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో కూడా ప్రశాంత్ కిషోర్ ఈ తరహా వ్యాఖ్యలు చేసారు. అప్పట్లో ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు.
2019 ఎన్నికల్లో వైసీపీకు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పనిచేసారు. మహా సంకల్ప పాదయాత్రకు ముందు నిర్వహించిన బహిరంగ సభలో ప్రశాంత్ కిషోర్ ను వైసీపీ నాయకులు, కార్యకర్తలకు జగన్ పరిచయం చేసారు. వైసీపీ అధికారంలోనికి వచ్చిన తరువాత ప్రశాంత్ కిషోర్ ఇంట జరిగిన ఓ వివాహానికి సతీ సమేతంగా జగన్ హాజరయ్యారు. 2019 ఎన్నికల తరువాత కూడా ఐ ప్యాక్ టీంను తన ఎన్నికల కార్యకలాపాలకు జగన్ ఉపయోగిస్తున్నారు. అయితే ప్రశాంత్ కిషోర్ బీహార్ లోని ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన తరువాత… ఐ ప్యాక్ టీం ను రిషి రాజ్ సింగ్ నడుపుతున్నట్లు… ఈ నేపథ్యంలో జగన్ కు పీకేకు చాలా గ్యాప్ వచ్చినట్లు ప్రచారం జరిగింది.
ఇంతలోనే ఓ రెండు నెలల క్రితం ప్రశాంత్ కిషోర్… నారా లోకేష్ తో కలిసి విజయవాడ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షం కావడం… ఇద్దరూ కలిసి చంద్రబాబు ఇంటికి వెళ్ళి భేటీ కావడం జరిగింది. దీనితో ప్రశాంత్ కిషోర్ పై వైసీపీ నాయకులు, అనుంబంధ మీడియా బీహారీ గజదొంగతో చంద్రబాబు చెట్టాపట్టాల్ అంటూ కథనాలు కూడా ప్రచురించింది. ఇలాంటి సమయంలో వైసీపీ ఓటమి ఖాయమంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.