శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఉత్తరవాహినిగా ప్రవహిస్తోన్న పవిత్ర స్వర్ణముఖి నదికి శాస్త్రోక్తంగా మంగళవారం రాత్రి హారతులు సమర్పించిన ఘట్టం ఆద్యంతం భక్తులను పులకింపజేసింది. ఆలయంలోని అలంకార మండపంలో గంగాదేవి ఉత్సవమూర్తిని స్వర్ణాలంకృత శోభితంగా అలంకరించి ఊరేగింపుగా స్వర్ణముఖినది వద్దకు తీసుకువచ్చారు. వేదపండితులు ముందుగా స్వర్ణమ్మతల్లికి ఆగమోక్తంగా పూజలు చేసి మంత్రపుష్పం, నైవేద్యం సమర్పించారు. పండితులు చతుర్వేదపారాయణం చేశారు. గంగాదేవికి ప్రత్యేకపూజలు నిర్వహించాక ఐదుగురు అర్చకులు వేదికపై స్వర్ణమ్మకు అభిముఖంగా నిలబడి ధూపంతో వివిధ హారతులు సమర్పించారు. అనంతరం స్వర్ణముఖిలో భక్తులు దీపారాధనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, కార్యణిర్వాహనాధికారి రామారావు, ఆలయ అర్చకులు అర్ధగిరి స్వామి, ఆలయ సభ్యులు,భక్తులు పాల్గొన్నారు..