100 రోజుల ప్లాన్ లో బండి…
Bandi in 100 days plan… :
కరీంనగర్, జూలై 10,
కరీంనగర్ జాతీయ రహదారుల విస్తరణపై దృష్టి పెట్టిన కేంద్ర మంత్రి బండి సంజయం, ప్రధానంగా కరీంనగర్–జగిత్యాల, కరీంనగర్ – వరంగల్ (ఎన్ హెచ్ 563) జాతీయ రహదారి విస్తరణ పనులపై ఫోకస్ చేశారు. కరీంనగర్ నుండి వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు ఎంత వరకు వచ్చాయి? ఎదురవుతున్న ఇబ్బందులేమిటి? ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారు? అట్లాగే కరీంనగర్ నుండి జగిత్యాల వరకు జాతీయ రహదారుల విస్తరణ పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతోంది? భూసేకరణ ఎంత వరకు వచ్చింది? టెండర్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారు? పనులెప్పుడు మొదలుపెడతారు? ఈ విషయంలో ఎదురువుతున్న ఇబ్బందులేమిటి? అనే అంశాలపై అధికారులతో చర్చించారు.కరీంనగర్ – జగిత్యాల జాతీయ రహదారి(ఎన్ హెచ్ 563) విస్తరణ పనులకు సంబంధించి 15 రోజుల్లోపు టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రూపొందించిన వంద రోజుల ప్రణాళికలో కరీంనగర్ – జగిత్యాల రహదారి విస్తరణ పనుల అంశం ఉండటంతో సెప్టెంబర్ లోగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసుకుని పనులను ప్రారంభించే అవకాశాలున్నాయని తెలిపారు.రహదారికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ 40 శాతం మేరకు పూర్తయ్యిందని, త్వరలోనే భూసేకరణ ప్రక్రియను సైతం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రహదారి విస్తరణలో భాగంగా మూడు ప్రాంతాల్లో బైపాస్ రోడ్లను నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. సుమారు రూ.2,227 కోట్ల అంచనా వ్యయంతో 58 కి.మీల పొడవున చేపట్టే విస్తరణ పనుల్లో భాగంగా 6 మేజర్, 18 మైనర్ బ్రిడ్జిలతోపాటు195 కల్వర్టులను నిర్మించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా భూసేకరణలో ఎదురువుతున్న ఇబ్బందులను అధికారులు ప్రస్తావించగా.. సంబంధిత జిల్లా కలెక్టర్, ఇతర శాఖల అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.అంతకుముందు కరీంనగర్ నుండి వరంగల్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల పురోగతిపై మంత్రి బండి సంజయ్ ఆరా తీయగా ‘ఇప్పటి వరకు 37 శాతం పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. 2025 జులై నాటికి విస్తరణ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ నుండి వరంగల్ వరకు 68.015 కి.మీల మేరకు జాతీయ రహదారి విస్తరణ పనులు 37 శాతం మేరకు పూర్తయ్యాయన్నారు.వచ్చే ఏడాది జులై నాటికి విస్తరణ పనులను పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయన్నారు. అందులో భాగంగా మానకొండూరు, తాడికల్, హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్ పర్తి వద్ద బైపాస్ లను నిర్మించనున్నట్లు తెలిపారు. 29 మైనర్ జంక్షన్లను నిర్మించనున్నామన్నారు. గట్టుదుద్దెనపల్లి, చెంజర్ల లో భూ సేకరణ విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడిందని పేర్కొన్నారు.