అదిలాబాద్, ఆగస్టు 21: కష్టపడి చదివి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాంక్ మేనేజర్‌గా ఉద్యోగం సాధించాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో హఠాత్తుగా మేనేజర్ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ షాకింగ్ ఘటన ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలంలో ఆదివారం (ఆగస్టు 20) చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, వాంకిడి ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం..ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) బానోతు సురేష్ (35) అనే వ్యక్తి బ్యాంక్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్య ప్రియాంకతో బ్యాంకు సమీపంలో ఓ ఇంట్లో నివాసం ఉండేవాడు. ఆగస్టు 17వ తేదీన విధులు పూర్తయ్యాక రాత్రి 7.30 గంటల సమయంలో బ్యాంకులోని తన క్యాబిన్‌లో ముందుగా తెచ్చుకున్న పురుగుమందు తాగాడు. అనంతరం వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన బ్యాంకు సిబ్బంది వెంటనే ఆసిఫాబాద్‌లో ఉంటున్న భార్య, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆసుపత్రికి తరలించమని తెలిపారు. దీంతో సురేష్ కుటుంబ సభ్యులు అతన్ని మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం సురేష్ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.బ్యాంకులో పనిభారం ఎక్కువగా ఉందని, ఇద్దరు చేసే పని తానొక్కడే చేస్తున్నట్లు తరచూ తనతో భర్త సురేష్ చెబుతుండే వాడని మృతుడి భార్య ప్రియాంక పోలీసులకు తెల్పింది. పని ఒత్తిడితోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని మృతుడి తండ్రి లక్ష్మీరాజం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు.