నమ్మకం పెంచుతూ వ్యాపారం విస్తరించాలి….జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
Business should be expanded by increasing trust..District Collector Muzammil Khan
ప్లాస్టిక్ ప్లేట్లు, కవర్ల వాడకం నివారించాలి
ఇందిరా మహిళా శక్తి యూనిట్ లను క్షేత్ర స్థాయిలో సందర్శించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం:
ప్రజలలో నమ్మకం కలిగిస్తూ వ్యాపారాలను విస్తరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఇందిరా మహిళా శక్తి పథకం యూనిట్ లబ్దిదారులకు సూచించారు.
సింగరేణి మండలంలో ఇందిరా మహిళా శక్తి పథకం క్రింద స్వశక్తి మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన వివిధ యూనిట్ లను కలెక్టర్ పరిశీలించారు.
కారేపల్లిలో ఇందిర మహిళా శక్తి పథకంలో విజేత ఎస్.హెచ్.జి మహిళ సమైక్య సభ్యురాలు కె. కళమ్మకు మంజురైన యూనిట్ మణి హోమ్ ఫుడ్ సెంటర్ ను ప్రారంభించారు.
వెన్నెల గ్రామ గ్రూప్ సంఘం సభ్యురాలు కళావతి ఉపేందర్ కు మంజూరై నడుపుతున్న యూనిట్ వెంకటేశ్వర ఆటోమొబైల్ షాపు ను, సాయిరాం ఎస్.హెచ్.జి సమైక్య సభ్యురాలు టి. రూపకు మంజురై నడుపుతున్న వర్ష బ్యూటి పార్లర్ సెంటర్ ను, ఇందిర ప్రియదర్శిని గ్రూప్ సభ్యురాలు గంగరబోయిన లక్ష్మీ కాంతమ్మ సత్యంకు మంజూరైన యూనిట్ మురళీ మెస్, వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీ పాయింట్ ను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మణి హోం ఫుడ్ దగ్గర ఏ పదార్దాలు అమ్ముతున్నారు, యూనిట్ ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుంది, పిల్లలు ఏం చదువుకున్నారు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వర్ష బ్యూటీ పార్లర్ వ్యాపారం ఎలా నడుస్తుంది, పెళ్ళి సమయంలో మేకప్ పనులు ఎలా ఉంటాయి, మేనిక్యూర్ పెడిక్యూర్ వంటి కొత్త సేవలు అందించాలని, పార్లర్ కు వచ్చే కస్టమర్లతో మంచి పేరు డెవలప్ చేసుకోవాలని అన్నారు.
మెస్ నిర్వాహకురాలి కోరిక మెరకు మెస్ లో భోజనం చేశారు. కూరలు రుచిగా ఉన్నాయని, భోజనం చాలా బాగుందని కలెక్టర్ కితాబిచ్చారు. వండే పదార్థాలలో శుచి, శుభ్రతను పాటిస్తూ నాణ్యతలో లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ప్లాస్టిక్ ప్లేట్స్, కవర్స్ వాడకుండా నిషేదించాలని వాటికి ప్రత్యామ్నాయంగా అరటి అకులు ఉపయోగించాలని సూచించారు. వంట అద్భుతంగా ఉందని ఇదే పద్దతి కొనసాగిస్తూ నమ్మకం పెంచుకుంటూ వ్యాపారం సాగించాలని ఆకాంక్షించారు.
వెంకటేశ్వర ఆటోమొబైల్ షాపు ఏర్పాటు కోసం రుణం ఎంత తీసుకున్నారు, వ్యాపారం ఎలా జరుగుతుంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న పరికరాలు మాత్రమే కొనుగోలు చేసి వ్యాపారం చేయాలని, పరికరాలు కొనుగోలు చేసే టైంలో నలుగురు దగ్గర ధరలను చెక్ చేసుకోవాలని అన్నారు. మన ఆదాయం ఎలా పెంచుకోవాలో ఆలోచిస్తూ వ్యాపారం చేయాలని, న్యాయబద్దంగా ఉండాలని, మన పెట్టుబడి త్వరగా సంపాదించాలని అన్నారు.
ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట అదనపు డిఆర్డీవో నూరొద్దీన్, తహసీల్దార్ సంపత్ కుమార్, ఎంపిడివో సురేందర్, ఎంఐవో జయరాజ్, ఎంపిఓ రవీంద్ర ప్రసాద్, ఏపీఎం వెంకటేశ్వర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.