Tuesday, January 27, 2026

కేబినెట్ విస్తరణ కు కసరత్తు…

- Advertisement -

కేబినెట్ విస్తరణ కు కసరత్తు…
హైదరాబాద్, డిసెంబర్ 19
తెలంగాణలో ప్రభుత్వం కొలువుదీరి 10 రోజులు అవుతుంది. ఇప్పటికే 11 మంది మంత్రులు రేవంత్‌ టీంలో ఉన్నారు. ఇంకా 7 ఖాళీలు ఉన్నాయి. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీపైనా హైకమాండ్‌తో చర్చించనున్నారని సమాచారం. ఈ నెలాఖరులోపు తెలంగాణలో మంత్రి మండలి విస్తరణ ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. ఖాళీగా ఉన్న 7 పోర్ట్‌పోలియోల కోసం రేవంత్ కసరత్తు పూర్తి చేశారని, మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్‌ పదవులు, ఎమ్మెల్సీ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టారని సమాచారం. త్వరలోనే లోక్‌సభ, పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావాలంటే కీలకమైన నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని రేవంత్ ఆలోచిస్తున్నారు.అన్నింటి కంటే ముఖ్యమైన 7 మంత్రి పదవులపై చాలా మంది ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇప్పటికే మంత్రి పదవులు వచ్చిన జిల్లాల నుంచి పెద్దగా పోటీ లేకపోయినా ప్రాధాన్యత ఇవ్వని జిల్లాల నుంచి మాత్రం భారీగానే కాంపిటీషన్ ఉంది. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు. హైదరాబాద్ లో ఒక్కరు కూడా కాంగ్రెస్ తరపున గెలవలేదు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్ నుంచి గడ్డం ప్రసాద్ కుమార్, పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి విజయం సాధించారు. వీరిలో గడ్డం ప్రసాద్ కుమార్ కు స్పీకర్ పదవి దక్కింది. మిగిలిన ఇద్దరిలో మల్ రెడ్డి రంగారెడ్డి చాలా సీనియర్. అనేక పర్యాయాలు విజయం సాధించారు. ఆయన రేసులో ముందున్నారు. హైదరాబాద్ లో కొన్ని సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. కచ్చితంగా గెలుస్తామని ధీమాతో ఉన్న నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఓటమి పాలయ్యారు. మరోవైపు నిజామాబాద్ లో మాజీ మంత్రి షబ్బీర్ అలీ సైతం పరాజయం పాలయ్యారు.  ఇద్దరు నేతలు రేవంత్ రెడ్డికి సన్నిహితులు. షబ్బీర్ అలీకి ఇస్తే నిజామాబాద్ తో పాటు మైనార్టీకి ఇచ్చినట్లు అవుతుంది. ఫిరోజ్ ఖాన్ కు ఇస్తే మైనార్టీతో పాటు హైదరాబాద్ కు ప్రాతినిధ్యం కల్పించినట్లు అవుతుంది. మైనార్టీల్లో ఒకరికి మంత్రి ఇస్తే ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్ సాగర్ రావు, వివేక్ వెంకటస్వామి, నిజామాబాద్ జిల్లాలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. మల్కాజిగిరి నుంచి ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావు మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే ఆయన్ను మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపాలనే ఆలోచన ఉన్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు, కేబినెట్ విస్తరణలో అవకాశం కల్పించేలా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్‌, మధుయాష్కీలు మంత్రులుగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీలుగా ఎంపిక చేస్తారని వారి అనుచరులు చెబుతున్నారు. అదే సమయంలో కీలకమైన హోం శాఖ ఎవరికైనా అప్పగిస్తారా లేక సీఎం వద్దనే ఉంచుకుంటారా అనే చర్చ కూడా సాగుతోంది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో ముందుగా పదవుల పంపిణీ ద్వారా పార్టీలో జోష్‌ తేవాలని భావిస్తున్నారు. లోక్‌సభ అభ్యర్థుల విషయంలోనూ ఇప్పటికే ఒక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో గ్రేటర్‌ హైదరాబాద్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తారని సమాచారం. హైదరాబాద్‌ నగరంలోని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరూ ఎన్నికల్లో గెలవలేదు. మంత్రివర్గంలో స్థానం కల్పించిన తర్వాత మండలికి పంపుతారన్న ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో ఆరుగురు ఓసీలు ఉంటే బీసీలు ఇద్దరు, ఎస్సీలు ఇద్దరు, గిరిజనులు ఒకరు ఉన్నారు. ఓసీ సామాజివర్గంలో మల్ రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి రేసులో ముందున్నారు. ఎస్సీల్లో మాల, మాదిగ సామాజిక వర్గాలను తీసుకున్నారు. మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ ను స్పీకర్ గా నియమించడంతో మాదిగ సామాజికవర్గం నేతకు కేబినెట్ లో చోటు ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించాల్సి వస్తే ఎవరికి ఇవ్వాలన్న దానిపై కసరత్తు జరుగుతోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్