వేసవి కాలం ఆరంభమైంది. మార్చిలోనే ఎండలు మే నెలను తలపిస్తున్నాయి. ఓవైపు భానుడి భగభగ మరోవైపు ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం షురూ అయింది.
ఇక పలు ప్రాంతాలను నీటి ఎద్దడి పట్టి పీడిస్తోంది. రాష్ట్రంలో పలు చోట్ల ప్రజలు తాగునీటి సరఫరా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్, తాగునీటి అవసరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా విద్యుత్, తాగునీటి అవసరాల్లో ఇబ్బందులు తలెత్తకుండా సీఎం ఇవాళ సచివాలయంలో రెండు అంశాలపై సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు విడుదల కావటం, కోడ్ అమల్లోకి రావటంతో విద్యుత్, తాగునీటిపై అప్రమత్తంగా ఉండాలని ఇది వరకే ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. వేసవి వేళ విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పాటు కొన్నినెలలుగా వర్షాల్లేక ప్రాజెక్టుల్లోనూ నీరు డెడ్ స్టోరేజీకి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎండాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.