మళ్లీ తెలంగాణ బీజేపీలో వలసల పుకార్లు
హైదరాబాద్, ఆగస్టు 26: తెలంగాణ బీజేపీ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. బండి సంజయ్ ను తప్పించి కిషన్ రెడ్డిని చీఫ్ గా నియమించి కొంత మంది నేతలకు పదవులు ప్రకటించిన తర్వాత .. ఇక వలసలు ఉండవని అనుకున్నారు. కానీ అభ్యర్థులు ఫైనల్ చేసే పరిస్థితికి వచ్చే సరికి పెద్ద పెద్ద నేతలు జంప్ అవబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఇందులో ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ వెంకటస్వామి వంటి నేతలు ఉన్నారు. నిజంగానే వీరంతా అదే ఆలోచనలో ఉంటే.. మరికొంత మంది సీనియర్లు కూడా తమ దారి తాము చూసుకుంటారన్న చర్చ జరుగుతోంది. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఈటల గ్రామల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కమలాపురం మండలానికి వెళ్లిన ఈటలకు స్థానిక కార్యకర్తలు అత్యధిక మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లోకి పోవాలని డిమాండ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలోని మండలాల కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోకుంటానని ఆయన వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈటల కాంగ్రెస్ లో చేరుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పొంగులేటితో పాటు జూపల్లిని బీజేపీలోకి రప్పించే క్రమంలో వారే తనకు రివర్స్ కౌన్సెలింగ్ ఇచ్చారని చెప్పుకున్నారు. ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి ఆయనపై కార్యకర్తల ఒత్తిడి ప్రారంభించారు. మునుగోడు నియోజవర్గంలో కోమటిరెడ్డి అనుచరులు కూడా మళ్లీ కాంగ్రెస్ లోకి వెళదామని ఒత్తిడి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈటలకు ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ బాధ్యతలు అప్పజెప్పిన… కోమటిరెడ్డిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. దీంతో బీజేపీ కార్యక్రమాలు సాఫీగా సాగుతాయని అందరూ అనుకున్నారు. కానీ కథ మళ్లీ మొదటికొచ్చింది. అయితే ఈసారి నాయకుల నుంచి కాకుండా కార్యకర్తల రూపంలో సెగ తగులుతున్నది. అయితే నేతలే వ్యూహాత్మకంగా కార్యకర్తల పేరుతో ఒత్తిడి చేయించుకుంటున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇక ఉత్తర తెలంగాణలో కీలక నేతగా ఉన్న గడ్డం వివేక్ తన తండ్రి అంటి పెట్టుకుని ఉన్న పార్టీలో చేరాలని అనుకుంటున్నారని చెబుతున్నారు. వారంరోజుల్లో ఆయన కాంగ్రెస్ లో చేరవచ్చని చెబుతున్నారు. పెద్దపల్లి ఎంపీ స్థానానికి బీజేపీ తరపున పోటీ చేసినా విజయం కష్టమనేని… కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే బెటరని వివేక్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది గతంలో బీజేపీ మాజీ అధ్యక్షులు బండి సంజరుకుమార్, ఈటల, కోమటిరెడ్డి మధ్య తీవ్రమైన అంతర్గత పోరు కొనసాగింది. అనుహ్య పరిణామాల రీత్య ఆయన్ను మార్చడంతో అంతర్గత విభేదాలు సద్దుమణిగిందని భావించారు. కానీ బీజేపీ తరపున పోటీ చేసి ఎన్నికల్లో గెలవడం కష్టమని.. బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరుదామని కార్యకర్తలు అంటున్నారు. ఎన్నికలకు మూడు, నాలుగు నెలల సమయం ఉండటంతో బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొవడం బీజేపీకి సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పాత నేతలకు, బీజేపీలో కొత్తగా చేరిన నాయకులకు మధ్య విభేదాలు తీవ్రంగా ఉన్నాయి. ఈ పరిణామాలు తెలంగాణ బీజేపీ నేతల్ని టెన్షన్ కు గురి చేస్తున్నాయి.