ఉప్పాడ మత్స్యకారులకు తుపాను నష్టపరిహారం అందించాలి
దెబ్బతిన్న 157 బోట్లకు పరిహారం చెల్లించాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Compensation must be paid for the 157 damaged boats: Deputy CM Pawan Kalyan
అమరావతి: అర్నబ్ తుపాను కారణంగా నష్టపోయిన ఉప్పాడ మత్స్యకారులకు, చేనేత కార్మికులకు త్వరితగతిన నష్టపరిహారం అందించాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పాడ తీరంలో 40 బోట్లు, కోనసీమ జిల్లా తీర ప్రాంతంలో మరో 117 బోట్లు దెబ్బతిన్నాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా బోట్లు, వలలు, వేట సామగ్రి కోల్పోయిన మత్స్యకారులకు పరిహారం అందించాలని కోరారు. భారీ వర్షాలతో ఉప్పాడ ప్రాంతంలో చేనేత మగ్గాల్లోకి నీరు చేరడం, విద్యుత్ లైన్లు దెబ్బతినడంతో కార్మికుల జీవనోపాధికి నష్టం వాటిల్లిందని తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి చేనేతలకు కూడా పరిహారం అందించాలని సూచించారు. తుపాను సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు సీఎం చంద్రబాబు చేపట్టిన చర్యలను పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రులు, అధికారులు, సిబ్బందిని అభినందించారు.





