Sunday, September 8, 2024

అభ్యర్ధుల ఎంపికపై మల్లగుల్లాలు

- Advertisement -

అభ్యర్ధుల ఎంపికపై మల్లగుల్లాలు
విజయవాడ, డిసెంబర్ 27
జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ ఈసారి ఎలాగైనా ప్రభుత్వంలో కీలక భూమిక పోషించాలని భావిస్తున్నారు. అందుకోసం ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ స్పష్టమైన వైఖరితో ముందుకు వెళుతున్నారు. ఎక్కువ సంఖ్యాబలంతోనే జనసేన అసెంబ్లీలోకి కాలుమోపాలన్న లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. ఇందుకోసం అన్ని రకాలుగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అభ్యర్థుల ఎంపికలోనూ ఆయన ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందరూ ప్రచారం చేస్తున్నట్లు కేవలం ఇరవై సీట్లనే టీడీపీ పొత్తులో భాగంగా ఇస్తే కుదరదని చెప్పేందుకు కూడా ఆయన సిద్ధపడుతున్నట్లు సమాచారం. తనకు ప్రత్యేకంగా బలమున్న స్థానాలను పొత్తులో భాగంగా వదులుకునేందుకు కూడా జనసేనాని ఇష్టపడటం లేదు.అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యత కల్పించాలన్న యోచనలో పవన్ ఉన్నారు. రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలు, కులాల వారికి రాజకీయ సాధికారతతోనే ముందుకు తీసుకెళ్లాలన్న కృతనిశ్చయ్యంతో పవన్ ఉన్నారంటున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో ఆయన అనేక కసరత్తులు ప్రారంభించారు. ఈ నెల 14వ తేదీ నుంచి అభ్యర్థుల ఎంపికపై అధ్యయనం చేస్తున్న పవన్ కల్యాణ్ ఇప్పటికే ఇరవై స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్లు తెలిసింది. ఇది మొదటి విడత మాత్రమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలోని ఎనభై నుంచి ఎనభై ఐదు స్థానాలపై అధ్యయనం చేసి జనసైనికులు సంతృప్తిపడేలా సీట్లు దక్కేలా పవన్ ప్లాన్ చేసుకుంటున్నారని విశ్వసనీయంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రజారాజ్యం నుంచి తనతో కలసి నడిచిన వారికి అన్యాయం చేయకూడదన్న లక్ష్యంతో పవన్ ఉన్నారంటున్నారు. అదే జరిగితే టీడీపీ ఇరవై నుంచి ఇరవై ఐదు స్థానాలతో సరిపెడితే సరిపోదు. అందుకు పవన్ కల్యాణ్ ఒప్పుకునే అవకాశాలు కూడా ఉండవనే తెలుస్తోంది. కనీసం నలభై నుంచి నలభై ఐదు స్థానాల్లో విజయం తధ్యమని సర్వేల్లో తేలిందని చెబుతున్నారు. అదే సమయంలో మరో 30 స్థానాల్లో జనసేన విజయానికి చేరువలో ఉందని పవన్ కల్యాణ్ కు అందిన నివేదికల్లో స్పష్టమయిందని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో కూకట్‌పల్లిలో ఒకరోజు పవన్ కల్యాణ్ పర్యటిస్తేనే నలభైవేల ఓట్లు వచ్చాయని గుర్తు చేస్తుననారు. అందుకోసమే తక్కువ ఇస్తే తీసుకునేందుకు పవన్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. గౌరవప్రదమైన సంఖ్య పొత్తులో భాగంగా వస్తేనే అడుగు ముందుకు పడుతుందన్న ఆలోచనలో జనసేనాని ఉన్నారని చెబుతున్నారు. తొలి నుంచి పవన్ కల్యాణ్ చెబుతున్నట్లుగా ఆయన ఒక వ్యూహం ప్రకారమే ముందుకు వెళుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అంగీకరించేలా పవన్ కల్యాణ్ సీట్లలో బలాబలాలను లెక్కలతో సహా వివరించేందుకు సిద్ధపడుతున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది. అన్ని కులాల వారినీ సంతృప్తి పర్చేలా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెబుతున్నారు.  రెండు పార్టీలు కలిసినా ఓట్లు బదిలీ కావాలంటే ఇరు పార్టీల సీట్ల సంఖ్య చాలా ముఖ్యమవుతుంది. తగినన్ని సీట్లలో పోటీ చేస్తేనే రెండు పార్టీల నుంచి మరొకరికి ఓట్లు బదిలీ అయ్యే అవకాశాలున్నాయి. ఇదే విషయాన్ని చంద్రబాబుతో జరగనున్న సమావేశంలో పవన్ స్పష‌్టం చేయనున్నట్లు తెలిసింది. తక్కువ సీట్లు తీసుకుని త్యాగం చేసే పరిస్థితుల్లో జనసేన లేదన్న సంకేతాలను ఇప్పటికే పవన్ కల్యాణ‌్ సైకిల్ పార్టీ అధినేతకు పంపినట్లు సమాచారం. త్యాగాలు ఒకరు మాత్రమే చేస్తే సరిపోదని, రెండు వైపుల నుంచి ఉండాలన్నది పవన్ ఆకాంక్షగా చెబుతున్నారు. మొత్తం మీద ఒక వ్యూహం ప్రకారమే పవన్ కల్యాణ్ పొత్తులో భాగంగా సీట్లను ఖరారు చేసే పనిలో ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు పవన్ ను కాదని టీడీపీ కూడా వేరే దారి చూసుకోలేని పరిస్థితిలో పవన్ చంద్రబాబును నెట్టేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మరి పవన్ కల్యాణ్ సీట్ల సర్దుబాటు విషయంలో ఎలాంటి అడుగు వేస్తారోనన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్