అసమ్మతి సెగలు, నాయకుల మధ్య వాగ్వాదాలతో… పెద్దపల్లి

- Advertisement -
Disagreements broke out, with arguments between leaders... Peddapalli
Disagreements broke out, with arguments between leaders… Peddapalli

ఉత్కంఠ పోరు

బీఆర్‌ఎస్, బీజేపీలో అసమ్మతి సెగలు

సిటింగ్‌కు ఛాన్స్‌.. కష్టమే!

రేసులో ముందున్న కాంగ్రెస్‌  

పెద్దపల్లి: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇటీవల కాలంలో హాట్‌ టాపిక్‌గా మారిన నియోజకవర్గం పెద్దపల్లి. అధికార బీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ పార్టీలోనూ అసమ్మతి సెగలు, నాయకుల మధ్య వాగ్వాదాలుతో ఈ నియోజకవర్గం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ దూసుకెళ్తోంది. దీంతో.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఎవరు గెలుస్తారు? ప్రజలు ఎవరిని ఆదరిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

బీఆర్‌ఎస్‌.. సిటింగ్‌ ఎమ్మెల్యే హ్యాట్రిక్‌ ఆశలు

పెద్దపల్లి సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ నేత దాసరి మనోహర్‌ రెడ్డి.. ఈసారి కూడా బరిలో దిగి గెలుపొందాలని హ్యాట్రిక్‌ కొట్టాలని ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో 8,466 ఓట్ల మెజారిటీతో, అంతకుముందు 2014లొ 62,677 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఆయన మళ్లీ తనదే గెలుపు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పార్టీలో నెలకొన్న వ్యతిరేకత ఆయనకు ప్రమాదంగా మారింది.

కోర్టు కేసులు, అసమ్మతి స్వరాలు

బీఆర్‌ఎస్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డిపై ఆలయ భూముల కబ్జా కేసులు, అదే విధంగా సొంత పార్టీలోనే అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. ఆయన పదవీ కాలంలో పలు సొంత పార్టీ నేతలను పట్టించుకోలేదని.. స్వలాభం కోసమే చూసుకున్నారని పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

రేసులో మరో ఇద్దరు

ఇక.. బీఆర్‌ఎస్‌ నుంచి దాసరి మనోహర్‌ రెడ్డికి పోటీగా టికెట్‌ రేసులో మరో ఇద్దరు ముఖ్య నేతలు ఉన్నారు. ఎమ్మెల్సీలు భానుప్రసాద్, వెంకట్రామిరెడ్డిలు కూడా బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. దీంతో.. తనకు కాకుంటే తన రాజకీయ వారసురాలిగా.. తన కోడలు మమతా రెడ్డికి టికెట్‌ ఇవ్వాలని మనోహర్‌ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తన రాజకీయ వారసురాలిగా ఆమెను పరిచయం చేసిన మనోహర్‌ రెడ్డి.. తన బలంతో ఆమెకు పెద్దపల్లి మున్సిపల్‌ చై పర్సన్‌ పదవి లభించేలా చేయగలిగారు. ఇక.. మనోహర్‌ రెడ్డి విషయంలో అధిష్టానం కూడా ఆయనను దూరం పెట్టిందని.. ఈ క్రమంలోనే పరోక్షంగా అసమ్మతి నేతలకు మద్దతు పలుకుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈసారి ఆయనకు టికెట్‌ కష్టమనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో.. సామాజిక సమీకరణాల దృష్ట్యా భానుప్రసాద్‌కు అవకాశం లభిస్తుందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ

ఇక.. బీజేపీలోనూ టికెట్‌ కోసం తీవ్ర పోటీ నెలకొంది. పార్టీ ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌ రావు, మాజీ ఎమ్మెల్యే గొట్టిముక్కల రాజారెడ్డి కుమారుడు ఎన్‌ఆర్‌ఐ సురేశ్‌ రెడ్డి బరిలో నిలవాలని ఆశిస్తున్నారు. వీరిలో దుగ్యాలకు బండి సంజయ్‌ ఆశీస్సులు ఉండగా.. సురేశ్‌ రెడ్డికి టికెట్‌ లభించేలా పార్టీకే చెందిన మరో మాజీ ఎంపీ తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే.. సురేశ్‌ రెడ్డి ఇటీవలే పార్టీలో చేరడంతో.. నియోజకవర్గంలో ఆయనకంటే దుగ్యాలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న గుజ్జుల రామకృష్ణారెడ్డి తనకు కాకుండా ఎవరికి టికెట్‌ ఇచ్చినా ఓడిస్తానని తన శ్రేణుల వద్ద చెబుతున్నట్లు సమాచారం. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి కాకుండా కొత్త వారికి టికెట్‌ ఇవ్వడం ఏంటని గత కొంత కాలంగా బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అంతేకాకుండా.. బండి సంజయ్‌కు వ్యతిరేకంగానూ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో.. ఆయనకు చెక్‌ పెట్టేలా దుగ్యాలకు టికెట్‌ లభించేలా బండి పట్టు పడుతున్నట్లు సమాచారం.

కాంగ్రెస్‌.. విజయ రమణరావు

ఇక.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి చింతలకుంట విజయ రమణ రావుకే టికెట్‌ ఖరారైందని తెలుస్తోంది.. 2018లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చిన ఆయన కేవలం 8 వేల ఓట్ల తేడాతో ఓడిపాయారు. అప్పటి నుంచి మారిన పరిస్థితులు.. ప్రభుత్వ వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుంటే.. ఆయనకే గెలుపు అవకాశాలు ఉంటాయని పార్టీ రాష్ట్ర శాఖ భావిస్తోంది. అయితే.. పార్టీలో ఓదెల జడ్పీటీసీ గంట రాములు యాదవ్‌ వ్యవహారం కొంత ఇబ్బందికరంగా మారింది. బీసీ నేతగా గుర్తింపు పొందిన ఆయన. కాంగ్రెస్‌ టికెట్‌పై దృష్టి సారించారు. ఒకవేళ టికెట్‌  రాకపోతే ఇండిపెండెంట్‌గా సైతం పోటీ చేయాలని సిద్దమవుతున్న తెలుస్తోంది. అయితే.. ఇప్పటికే ఎన్నికల రేసులో విజయ రమణ ఎంతో ముందున్నారని.. బీఆర్‌ఎస్, బీజేపీలతో పోల్చితే ఆయన దాదాపు ఏడాది కాలంగా ప్రజల్లోనే తిరుగుతున్నారని.. ఇది ఆయనకు ఎంతో కలిసొచ్చే అంశమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్‌ నేతల వలసలు

ఇక.. కాంగ్రెస్‌ పార్టీకి తాజా పరిస్థితుల్లో అనుకూలిస్తున్న మరో అంశం.. అధికార పార్టీ నుంచి భారీగా నేతలు హస్తం గూటికి చేరడం. తాజాగా కొద్ది రోజుల క్రితం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ఎలువాక రాజయ్య, సుల్తానాబాద్‌∙మున్సిపల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ బిరుదు సుమత, సింగిల్‌ విండో చైర్మన్‌ వామనరావు పలువురు ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలు కాంగ్రెస్‌లో చేరారు. వీరంతా సిటింగ్‌ ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డిని వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రకటించడం అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలో క్షేత్ర స్థాయిలో ఉండే ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కాంగ్రెస్‌లో చేరడంతో ఈ సారి కాంగ్రెస్‌కే విజయావకావాలు ఎక్కువ ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ వర్గాలదే కీలకం

అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించడంలో నియోజకవర్గంలో ప్రధానంగా..మున్నూరు కాపులు, యాదవులు, ముదిరాజ్‌లు, గీత కార్మికులే కీలకంగా నిలుస్తున్నారు. మొత్తం 2.4 లక్షలకుపైగా ఉన్న జనాభాలో బీసీ ఓటర్ల సంఖ్య 50 శాతం పైగా ఉంటోంది. వీరిలో ఈ  వర్గాలే పై చేయిగా ఉంటున్నారు. దీంతో.. వచ్చే ఎన్నికల్లో వీరి ఆదరణను పొందేందుకు ఆయా పార్టీల నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయా వర్గాలకు చెందిన కుల పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తూ.. తమ పార్టీల తరఫున హామీలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా వీరిలోనూ గ్రామీణ ఓటర్లే దాదాపు రెండు లక్షల వరకు ఉంటారని అంచనా. దీంతో పార్టీలన్నీ గ్రామాల బాట పడుతూ అక్కడి ప్రజలను చేరువ చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

మొత్తంగా చూస్తే.. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌లలోని వర్గపోరు కాంగ్రెస్‌కు కలిసొస్తుందని.. ఇది ఆ పార్టీ గెలుపు అవకాశాలను సునాయసం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .అంతేకాకుండా… నియోజవకర్గంలో ధరణి పోర్టల్‌లో సమస్యల కారణంగా ఇబ్బందులకు గురవుతున్న వారికి, రికార్డుల్లో భూములు నమోదు కాని వారికి భరోసాగా నిలుస్తామనే ప్రకటనతో కాంగ్రెస్‌ బరిలో దిగుతోంది.

పెద్దపల్లి నియోజకవర్గం ముఖ్యాంశాలు

మొత్తం ఓటర్లు: 2.4 లక్షలు

బీసీ ఓటర్లు: దాదాపు 1.8 లక్షలు

గెలుపోటముల నిర్ణయంలో కీలకంగా,మున్నూరు కాపులు, యాదవ, ముదిరాజ్, కల్లుగీత కార్మిక వర్గాలు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular